ఎత్తిపోతలతో గట్టు సస్యశ్యామలం

Wed,March 20, 2019 12:46 AM

-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు
-జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్
-టీఆర్‌ఎస్ మరోసారి సత్తా చాటడం ఖాయం
-రాష్ట్ర వినియోగదారుల ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప
-గట్టులో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
గట్టు : గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి గట్టు మండలం సస్యశ్యామలం కానున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రం గట్టులో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అనతి కాలంలోనే పెద్దపార్టీగా అవతరించి రెండుసార్లు ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం గొప్ప విషయమన్నారు. ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి రావడానికి దోహదపడ్డాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి పక్క రాష్ర్టాలు అబ్బుర పడుతున్నాయన్నారు. కరువుకు నిలయమైన గట్టును గట్టెక్కించడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గట్టు ఎత్తిపోతల త్వరలో కార్యరూపం దాల్చనున్నదన్నారు. 10-15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో గట్టు ఎత్తిపోతల రాయాపురం సమీపంలో నిర్మాణం కానున్నదన్నారు.

దీని సర్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిమిత కాలంలో ఎక్కువ నీరు పంపింగ్ జరిగేలా ఈ పథకానికి రూపకల్పన జరుగు తుందన్నారు. జూరాల బ్యాక్‌వాటర్‌తో ఈ రిజర్వాయర్‌ను నింపనున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణలు మరోసారి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వానికి కీలకం కానున్నందున ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని హితవు పలికారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్ వశం కావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకుపోయి ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు ఆకర్షితులయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షం బెంబేలెత్తు తుందన్నారు. కాంగ్రెస్‌తో ఇక చేసేదేమిలేదనుకుంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని తేల్చి చెప్పారు. రాష్ట్ర వినియోగదారుల ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జాడ కనిపించడంలేదని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీతమ్మ, జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్‌శెట్టి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పరమాల నాగరాజు, సురేశ్ శెట్టి, రామకృష్ణారెడ్డి, శ్రీనాథ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles