ఈవీఎంలపై.. అవగాహన..!

Mon,March 18, 2019 11:53 PM

-గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం
-గ్రామస్తులకు సెక్టోరియల్అధికారుల సదస్సులు
-320 మండలాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
-నూతన ఓటర్లపై ప్రత్యేక దృష్టి
-దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు
జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు కావల్సిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని సమకూర్చే పనిలో పడ్డారు. దీంతో పాటు ముఖ్యంగా గ్రామాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 12 మండలాల్లోని సెక్టోరియల్ అధికారులు ప్రతి రోజూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతకు వారి సందేహాలు నివృత్తి చేస్తూ ఈవీఎంల పనితీరును వివరిస్తున్నారు.

ఎన్నికల కోడ్ కూయడంతో జిల్లాలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. శాసన సభ, పంచాయతీ ఎన్నికలను విజయవంతగా నిర్వహించిన విధంగా పార్లమెంట్ ఎన్నికలను కూడా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గద్వాల నియోజకవర్గాన్ని జేసీ నిరంజన్‌ను, అలంపూర్ నియోజకవర్గానికి ఆర్డీవో రాములును అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించి కార్యచరణ ప్రారంభించారు. వారితో పాటు ప్రతి మండలానికి సెక్టోరియల్ అధికారులను, ైఫ్లెయింగ్ స్కాడ్స్‌ను ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించి ఆయా మండలాల బాధ్యతలను అప్పగించారు. మొదట సెక్టోరియల్ అధికారులతో ప్రతి గ్రామంలో ఈవీఎంల వినియోగంపై అవగాహన కార్యక్రామలు చేపట్టారు.

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వాటితో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఏవిధంగా ఉపయోగించాలని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారు. ఈవీఎంలో భాగమైన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల పనితీరును పల్లె ప్రజలకు వివరిస్తున్నారు. బ్యాలెట్ యూనిట్‌పై 16 బటన్లపై ఓటరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వారి గుర్తుకు ఎదురుగా నొక్కడం వల్ల ఆ వ్యక్తికి ఓటు పడుతుందని వివరిస్తున్నారు. ఓటు వేయాలనుకునే అభ్యర్థి పార్టీ గుర్తుతో పాటు ఫొటోను కూడా బ్యాలెట్ యూనిట్‌లో పొందుపరచబడి ఉంటుందని చెబుతున్నారు. దీనితో పాటు ఓటు నిర్దారణ చేసుకునేందుకు పక్కనే వీవీ ప్యాట్ ద్వారా తెలుసుకోవచ్చని గ్రామస్తులకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు. వీవీ ప్యాట్‌లో ఓటు వేసి పార్టీ గుర్తు, అభ్యర్థి పేరును ముద్రించబడిన కాగితంను 7 సెకన్ల పాటు ప్రదర్శిస్తుందని చెబుతున్నారు. దీని ద్వారా తాము ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశామో నిర్ద్థారించుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో ఎక్కువగా నూతన ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు ఏ మాత్రం గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు సెక్టోరియల్ అధికారులు వివరిస్తున్నారు.

జిల్లాలోని 320 గ్రామాల్లో అవగాహనలు
జిల్లాలోని 12 మండలాల్లో 320 గ్రామాల్లో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సెక్టోరియల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అప్పటిలోగా అవగాహన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 6,166 మంది పెరిగారు. పెరిగిన ఓటర్లతో కలుపుకొని జిల్లాలో పురుషులు 2,28,341, స్త్రీలు 2,30,928, ఇతరులు 6, మొత్తం ఇప్పటి వరకు 4,59,275 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో గద్వాల నియోజకవర్గంలో 2,34,723 మంది ఓటర్లు, అలంపూర్ నియోజకవర్గంలో 2,24,492 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో ఈ సారి 508 ఉన్న పోలింగ్ బూత్‌లను 592కు పెంచారు. వాటిలో గద్వాల నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలు, అలంపూర్ నియోజకవర్గంలో 289 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నూతన పోలింగ్ బూతుల్లో ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

పోలింగ్ బూత్‌ల్లో సదుపాయాలు
ఓటు వినియోగించునేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ బూత్‌ల్లో కావల్సిన సదుపాయాలు సమకూర్చుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి అక్కడి నుంచి వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి మళ్లీ తిరిగి ఇంటి వరకు తీసుకెళ్లే బాధ్యతలను చేపట్టారు. వాటితో పాటు క్యూలైన్లలో ఉన్న ఓటర్ల కోసం ప్రత్యేకంగా టెంట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles