ప్రజా భద్రత కోసమే తనిఖీలు

Mon,March 18, 2019 01:24 AM

-తనిఖీలపై భయాందోళన అవసరం లేదు
-గద్వాల డీఎస్పీ ఎండీ షాకీర్ హుస్సేన్
-గోనుపాడులో కార్డన్ సెర్చ్
-117 ఇళ్ల సోదాలు.. సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
గద్వాల క్రైం : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని గోనుపాడులో ఆదివారం జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీనాయక్ ఆదేశాల మేరకు గద్వాల డీఎస్పీ షాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 67 మంది పోలీసు సిబ్బంది గ్రామంలో 117 ఇళ్లను సోదా చేశారు. ఈ తనిఖీలో సరైన ధ్రుపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని గద్వాల రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ షాకీర్ హుస్సేన్ గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ కేవలం గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారి భద్రత కోసమే కార్డన్ సెర్చ్ పేరిట ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తాము నిర్వహించే ఇలాంటి తనిఖీల విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో నేరాల నియంత్రణ కొరకు రూట్స్ వారీగా బీట్స్, పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు. ఎప్పటికపుడు సమాచారం తెలుసుకోవడంతో పాటు పాత నేరస్తుల సమాచారాన్ని, వారి కదలికలను తెలుసుకోడానికి బ్లూకోల్ట్స్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. నేరస్తులను గుర్తించేందుకు జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారన్నారు. నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఫేస్ రికగ్నైజింగ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉందన్నారు.

నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎట్టి పరిస్థితులు తప్పించుకునే వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాల నియంత్రణకై కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ గ్రామస్తులకు సూచించారు. అదే విధంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేందుకు గ్రామస్తులకు సహకరించాలన్నారు. అంతే కాకుండా ఇటీవల పలువురు మైనర్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే చర్యలు తీసుకుంటామన్నారు. సినిమాలు, సీరియల్స్ తదితర వాటి ప్రభావంతో ఫ్యాషన్ పేరుతో పలువురు మత్తుపదార్థాలకు బానిసై చెడు వైపునకు దారితీస్తున్నారని, అలాంటి వారిపై నిఘా ఉంచామన్నారు. చట్ట విరుద్ద కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని డీఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో గద్వాల సీఐ జక్కుల హనుమంతు, రూరల్ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణ, జిల్లాలోని మిగతా స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles