పది పరీక్షలకు సర్వం సిద్ధం

Fri,March 15, 2019 12:50 AM

-జిల్లాలో 38 సెంటర్లు ఏర్పాటు
-హాజరు కానున్న 8,759 మంది విద్యార్థులు
-కలెక్టర్ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ : ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 7551 మంది రెగ్యులర్, 1208 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలో రెగ్యులర్, సప్లమెంటరీ విద్యార్థులు కలిపి 8,759 మంది పరీక్షలకు హాజరవుతున్నా రన్నారు. ఇందు కోసం జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలు రెగ్యులర్ విద్యార్థుల కోసం, మూడు సెంటర్లు సప్లమెంటరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు పరీక్ష పూర్తి అవుతుందన్నారు. విద్యార్థులు గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు అనుగుణంగా పరీక్ష సమయంలో ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. పశ్నాపత్రాలు ఉండే స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్‌లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పరీక్షలు విజయవంతం కావడానికి కృషి చేయాలన్నారు.

వీటన్నింటినీ సమన్వయం చేయడానికి జేసీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుక రావద్దని సూచించారు. జిల్లా మొత్తం 38 మంది సిట్టింగ్ స్కాడ్‌లు, ఇద్దరు ైఫ్లెయింగ్ స్కాడ్‌లను నియమించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీటి సౌకర్యం, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైనా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావును ఆదేశించారు. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు మంచిగా రాసి తల్లిదండ్రులతో పాటు జిల్లాకు పేరు తీసుకు రావాలని కలెక్టర్ సూచించారు. మెరుగైన ఫలితాల కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. జిల్లా మొత్తం 438 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా మంచి వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles