‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి

Sun,January 20, 2019 12:52 AM

-సమస్యాత్మక ప్రాంతాల రూట్ మ్యాపులు తయారు చేసుకోవాలి
-పంచాయతీ ఎన్నికల రాష్ట్ర జనరల్ పరిశీలకుడు వైకే.నాయక్
గద్వాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో రెండో విడత నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ సమస్యలు రాకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పంచాయతీ ఎన్నికల రాష్ట్ర జనరల్ పరిశీలకుడు వైకే.నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల మండల అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ శశాంక, ఎస్పీ లక్ష్మీనాయక్ కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడికి వివరించారు. రెండో విడతలో మల్దకల్, అయిజ, రాజోళి, వడ్డేపల్లి మండలాల్లోని 74 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. అందులో 14 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 60 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. అందుకోసం ఇప్పటికే అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు జరిగే ఈ నెల 25న నాలుగు మండలాలకు స్థానికంగా సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. ఎన్నికలకు అవసరమైన రూట్ మ్యాప్ పాటు బందోబస్త్ వంటి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లొకేషన్ పరిధిలో ఒక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో ఒక బూత్ అధికారితో పాటు వీఆర్ ఉండేటట్లు రాత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని తహసీ ల్దార్ ఆదేశించారు.

పోలింగ్ నిర్వహించడానికి వచ్చే సిబ్బందికి భోజన సౌక ర్యాలతో పాటు కనీస సౌకర్యాలు సమకూర్చేలా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాలని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియో తీయించాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు రోజు నుంచి ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా క్షణాల్లో పోలింగ్ గస్తీ సిబ్బంది అక్కడికి చేరుకునేటట్లు రూట్ మ్యాపులు తయారు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు సీజింగ్ టీంలు ఏమి సీజ్ చేశారని ప్రశ్నించగా అందుకు ఎక్సైజ్ సీఐ గోపాల్ సమాధానమిస్తూ జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 880 లీటర్ల కల్లు, 95 లీటర్ల లిక్కర్ సీజ్ చేసి 15 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆరు నెలల పాటు 221 మందిని బైండోవర్ చేశామన్నారు. శనివారం సాయంత్రం నుంచి ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయిస్తామన్నారు. ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ మొదటి విడత పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడ సమస్యలు రాకుండా పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. రెండో విడత పోలింగ్ సైతం ఇదే తరహాలో బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుంద న్నారు. డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సీఐ స్థాయిలో గస్తీ బృందాలు తిరుగుతాయని, ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికి గస్తీ బృందం చేరుకునేలా రూట్ ప్లాన్ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జేసీ నిరంజన్, ఆర్ రాములు, డీపీవో కృష్ణ, బెటాలియన్ డీఎస్పీ భరత్, డీఎస్పీ షాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles