విఘ్నేశా..నమోస్తుతే

Thu,September 13, 2018 01:06 AM

-వాడవాడలా విగ్రహాల ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తి
-పట్టణాల నుంచి పల్లెలకు తరలించిన నిర్వాహకులు
-నేటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం
గద్వాల, నమస్తే తెలంగాణ : బొజ్జ గణపయ్య పండగ గురువారం ఉండడంతో నియోజక వర్గంలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గద్వాలలో విఘ్నేశుడి విగ్రహాలను కొనుగోలు చేసి గ్రామాలకు వాహనాల్లో తరలించారు. ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినాయకుల కోసం ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. అందుకు అవసరమైనా షెడ్లను నిర్మించారు. విఘ్నేశ్వరుడిని ధ్యానిస్తే విఘ్నాలన్నీ శాంతిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన విఘ్నేశ్వరుని పూజించనిదే ఏ కార్యం సఫలం కాదన్నది ప్రజల విశ్వాసం. విఘ్నాలు తొలగి సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వృద్ధిలోకి రావాలని కోరుతూ చవితి రోజు స్వామి వారికి ప్రీతి పాత్రమైన ఉండ్రాళ్లు, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వినాయక చవితి ప్రాముఖ్యతను ఓ సారి పరిశీలిస్తే.. శ్రీరాముడు తేత్రాయుగం, కృష్ణుడు ద్వాపర యుగాల నుంచి పూజలు అందుకుంటే వినాయకుడు మాత్రం వేదాల ముందు నుంచే పూజలందుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా తొలుత గణపతినే పూజిస్తారు. అందుకే ప్రతి ఏడాది గణపయ్య పుట్టిన రోజును వినాయక చవితి పర్వదినంగా నిర్వహిస్తారు.

వ్యాస మహర్షి రచించిన పురాణంలో వినాయకుడి లీలలు, అవతారాల గురించి ఉంది. బాలకృష్ణుడిలా అద్భుతాలు, లీలలు ప్రదర్శించా డని, విష్ణుమూర్తిలా పలు అవతారాలు ధరించాడని అందులో వివరించారు. అన్ని దేవత గుణాలకు, ఛందో, సకల శాస్ర్తాలకు వినాయకుడు అధిపతి అని పురాణం చెబుతుంది. గణేశుని ఆకారం ఓంకారానికి ప్రతి రూపమని, ఆయన రూపం అలంకారాన్ని, ప్రకృతిని ప్రతిబింబిస్తూ ఉంటుందని చెబుతుంటారు. మంత్ర శాస్త్రం ప్రకారం గణపతిని 32 రూపాలుగా, ఆగమ, శిల్ప శాస్ర్తాలను అనుసరించి వివిధ రూపాలుగా వర్ణిస్తున్నారు. అందులో బ్రహ్మ, గణపతి, శక్తి, క్షిప్ర, హేరంబ, వర, వల్లభ, లక్ష్మీ, సత్య, అమృతసిద్ధి గణపతులుగా పూజిస్తారు. ఆధునిక యుగంలోనూ గణనాథుడు వీధివీధిలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. 1893లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ సాముహిక వినాయక ఉత్సవ సాంప్రదాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అతి పెద్ద వేడుకగా మారింది. ఉత్సవాల సందర్భంగా గణపతి ధరించని రూపం ఉండదు, ఎత్తని అవతారం లేదు.

అన్ని దేవతా రూపాల్లో, దేశ నాయకుల రూపాల్లో వివిధ రంగుల్లో దర్శనమిస్తూ ఆబాలగోపాలం అలరిస్తున్నారు. గణపతిని 21 పత్రాలతో పూజలు చేస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల భావన. అందులో భాగంగా వినాయకుని ప్రతిష్ఠించిన సమయంలో ఆయనకు జమ్మి, రావి, తులసి, మామిడి, గరిక, జాజి జిల్లెడ, తెల్లమద్ది, కామాంచి, దేవదారు, దానిమ్మ విష్ణుపత్రం ఉత్తరేణి తదితర వాటితో పుష్పార్చన చేస్తే విఘ్నాలు తొలుగుతాయని ప్రజల, భక్తుల నమ్మకం. ఈ పత్రాలకు కాలుష్యమైన నీటిని శుద్ధి చేసే గుణం ఉండడం వల్లే గణపతికి వీటన్నింటితో పూజలు చేస్తారని చెబుతారు. వేడుకలు కొన్ని ప్రాంతాలల్లో 11 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 3, 5, 9 రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles