టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు

Wed,September 12, 2018 12:50 AM

-కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం
-వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం 24 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు
-ముందస్తు ఎన్నికలకు భయపడుతున్న ప్రతి పక్షాలు
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-అయిజలో వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాం ప్రారంభోత్సం
అయిజ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురు లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అయిజ పట్టణంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో రూ. 3 కోట్ల వ్యయంతో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఆధునిక గోదాంను జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ అబ్రహం, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.

గత అరవై ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో వెనుకబడి తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు, తన ప్రాణాన్ని తృణ పాయంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అందుకే తెలంగాణ జనం తిరిగి కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఇస్తుండటంతో ఉత్పత్తులు పెరుగుతాయనే సంకల్పంతోనే రాష్ట్ర ఆవిర్భావంలోనే 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆధునిక గోదాంలను నిర్మించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే రైతన్నలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, సాగునీటిని అందిస్తున్నారని వెల్లడించారు.

కోటి ఎకరాల మాగాణి నా తెలంగాణ అని సీఎం కేసీఆర్ కోటి ఎకరాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పిళ్ల పార్టీలతో జతకట్టి టీఆర్‌ఎస్‌తో డీకొనేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబుకు తెలంగాణలో పనేంటన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. జిల్లాలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలుకాక తప్పదని గ్రహించే ప్రతి పక్ష పార్టీల నాయకులు రాళ్లతో దాడులకు దిగడం పిరికిపందల చర్య అని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ అబ్రహాం అన్నారు.

అలంపూర్‌ను అభివృద్ధి చేయకపోగా, టీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తుండగా రాళ్లతో దాడుల చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అంతకుముందు తెలంగాణ తల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ రీజినల్ కో-ఆర్డినేటర్ లలిత ముదిరాజ్, జెడ్పీటీసీలు చంద్రావతి, ఖఘన్నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ నాగన్నగౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

118
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles