దసరా పండుగలోపు తుమ్మిళ్ల పనులు పూర్తి

Wed,September 12, 2018 12:47 AM

-పనులను పరిశీలించిన ఎస్‌ఈ, అధికారులు
-పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
రాజోళి : రానున్న దసరా పండుగలోపు తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు పూర్తి చేసి, ఆర్‌డీఎస్ ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఎస్‌ఈ మురళీధర్ రావ్ తెలిపారు. మంగళవారం ఆర్‌డీఎస్ ఈఈ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, కాంట్రాక్టర్ మెగా రెడ్డిలతో కలిసి తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనతి కాలంలోనే పనులు చాలా వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పైప్‌లైన్ పనులు పూర్తి కాగా, ఫోర్‌బే చివరి దశలో ఉందని, విద్యుత్ మోటర్లు బిగించడానికి స్లాబు నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. జీరో పాయింట్ నుండి అప్రోచ్ కెనాల్‌కు కూడా లైనింగ్ చేస్తామన్నారు. ప్రస్తుతం నీటి విడుదలపై దృష్టి పెట్టామన్నారు. పంప్ హౌస్‌లో ప్రధానమైన పనులతో పాటు దాదాపు అన్ని విభాగాల్లో పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

విద్యుత్ శాఖకు చెందిన పనులు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా స్తంభాల ఏర్పాటు వేగంగా కొనసాగుతుందన్నారు. మోటర్లను బిగించడానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. అధికారులతో పాటు పనులను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారి సురేశ్‌బాబు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంగా చేయడమే కాకుండా నాణ్యతను పాటిస్తున్నారని తెలిపారు. అనంతరం అధికారులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారాలు అందుతున్నాయని, రానున్న ఎన్నికలు, అసెంబ్లీ రద్దు వంటి అంశాలు కూడా పనులకు ఎలాంటి అడ్డంకులు కల్పించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఎస్ ఏఈఈ వరుణ్ కుమార్, ప్రవీన్ రెడ్డి, హేమంత్, నాని పాల్గొన్నారు.

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles