కార్యకర్తలను కళ్లల్లో పెట్టి చూసుకుంటా


Mon,September 10, 2018 01:07 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి కార్యకర్తను కళ్లల్లో పెట్టి చూసుకుంటానని, వారికి ఏ కష్టం, ఆపద వచ్చినా ఏ సమయంలో నైనా తన ఇంటి తలుపు తట్టవచ్చని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆదివారం గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి జడ్పీచైర్మన్ భాస్కర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ పాలనలో విసిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి ఎప్పటికీ సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం కార్యకర్తలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. కార్యకర్తలు కూడా పార్టీకి అండగా ఉండాలని కోరారు. 40 ఏళ్ల పాటు ఒకే కుటుంబానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసి పాలించారని ఆరోపించారు. ప్రస్తుతం వారు నియోజక వర్గంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలి పోయారన్నారు.

గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఓట్ల నుంచి ఎన్నికై మంత్రిగా పదవులు అనుభవించిన ఈ ప్రాంత నేత తనతో పాటు వారి కార్యకర్తలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప, గద్వాల నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా గద్వాల నియోజక వర్గ ప్రజలు అనుభవిస్తున్న బాధలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. గతంలో అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో జగదీశ్వర్‌రెడ్డి, వీరేశ్ చిన్నా, నరసింహ, అనిల్, రామకృష్ణ, శివ, నరేశ్, వెంకట్‌రెడ్డి, మహేంద్ర, నరసింహ, కృష్ణ, దస్తగిరి, రాము, మల్లికార్జునరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్ నేతలు లక్ష్మణ్, వీరారెడ్డి, పాండు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...