ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు


Thu,February 22, 2018 12:11 AM

గద్వాల టౌన్ : ఆర్టీసీ డీఎం ఏకపక్ష నిర్ణయాలతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులకు గురువుతున్నారని టీఎంయూ డిపో అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి బుల్లెట్ సుధాకర్‌లు ఆరోపించారు. గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నాలుగు సర్వీసులకు బుధవారం ఓటి ప్రకటించడాన్ని నిరసిస్తూ తెల్లవారుజామున టీఎంయూ కార్మికులు డిపో ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎం తప్పుడు నిర్ణయాలతో డిపో నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని విమర్శించారు. కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రతి రోజూ షెడ్యూల్‌ను మారుస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అసలు డ్యూటీ ఉందో లేదో అన్న విషయం కూడా కార్మికుడికి తెలపడం లేదన్నారు. ఓటీలు విధించడం ద్వారా డ్రైవర్లపై పనిభారం పెరుగుతుందన్నారు.

తద్వారా విధులు సరిగ్గా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే ఓటీ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే లాక్ సిస్టమ్‌ను పొడిగించాలని కోరారు. ఎక్స్‌ప్రెస్‌కు 75 కిలో మీటర్లకు లాక్ వేయాలని, పల్లెవెలుగుకు 65 కిలో మీటర్లకు లాక్ వేయాలని నిబంధనలు ఉన్నాయని, కానీ డీఎం సొంత నిర్ణయంతో ఎక్స్‌ప్రెస్‌కు 60 కిలో మీటర్లకు, పల్లెవెలుగుకు 45 కిలో మీటర్లకు లాక్ వేశారన్నారు. దీంతో గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక పోతున్నామని వాపోయారు. ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి వెంటనే కిలో మీటర్ల పరిధిని పెంచాలని కోరారు. కార్మికుల ధర్నా విషయాన్ని తెలుసుకున్న డీఎం డిపో చేరుకున్నారు. ఓటీల విధింపును తొలగింపుపై చర్చలు జరిపేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో కార్మికులు ధర్నాను విరమించారు. రీజినల్ కార్యదర్శి బీవీ రెడ్డి, బుచ్చయ్య, బాబురావు, కృష్ణ, ఎస్‌ఆర్ గౌడ్, భాస్కర్, శోభ, భవ్య, ఆస్లీమా, చంద్రకళ, నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వాలి : ఎస్‌ఐ శ్రీనివాసులు
ఆర్టీసీ డిపో ముందు టీఎంయూ కార్మికులు చేపట్టిన ధర్నా విషయాన్ని తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో డిపోకు చేరుకున్నారు. ధర్నా చేపట్టే విషయాన్ని ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బస్సుల్లో ప్రయాణికులు ఎలాంటి వస్తువులు గానీ, బ్యాగులు గానీ మరచినా, వదిలి వెళ్లిపోయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...