ఈ పాస్ సక్సెస్


Wed,February 21, 2018 12:40 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంతో పోలిస్తే.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆహార భద్రత కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఏ మాత్రం తగ్గలేదు. లబ్ధిదారులు గతంలో ఉన్న వాళ్లే ఉన్నారు. చౌకధర దుకాణాల డీలర్లూ మారలేదు. అధికారుల పర్యవేక్షణ కూడా యథావిధిగానే ఉంది. అయితే, నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంతో వేలాదిగా టన్నుల బియ్యం మాత్రం మిగులుతున్నాయి. దీంతో జనవరి నెలను పరిగణలోకి తీసుకుంటే ఈ-పాస్ విధానంలో దాదాపు రూ.6 కోట్ల 60 లక్షల విలువ చేసే బియ్యం మిగిలిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 19,458 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. అయితే, ఒక్క బియ్యపు గింజ కూడా డీలర్ల నుంచి ప్రభుత్వానికి తిరిగి వెళ్లేది కాదు.

డీలర్లు మాత్రం మొత్తం కోటా పంపిణీ చేసినట్లుగా లెక్కలు చూపేవారు. ఇదిలా ఉంటే, నూతన మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం గతేడాది ఏప్రిల్ నెలలోనే 40 చౌకధర దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ-పాస్ విధానాన్ని అమలు చేసింది. అనంతరం మే నెల నుంచి జిల్లాలోని అన్ని షాపుల్లోనూ ఈ-పాస్‌ను అమలు చేయగా, మిగిలిన వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.

2,461 మెట్రిక్ టన్నుల మిగులు..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 9,01,156 ఆహార భద్రత కార్డులున్నాయి. వీటికి సంబంధించి ప్రతి నెలా 19,458 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. ఇదే లెక్కన ఈ-పాస్ విధానం ద్వారా కూడా ఉమ్మడి జిల్లా వారీగా 2019 చౌకధర దుకాణాలకు బియ్యం పంపిణీ చేశారు. అయితే, జనవరి నెలలో దాదాపు 2,461 మెట్రిక్ టన్నుల బియ్యం మిగులుబాటైంది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.6 కోట్ల 60 లక్షల విలువ చేసే బియ్యం మిగిలాయి. బహిరంగ మార్కెట్‌లో చౌకధర బియ్యం అడ్డదారిలో చక్కర్లు కొడుతుండగా, ప్రభుత్వం ఈ-పాస్ విధానంతో చెక్‌పెట్టింది. జనవరి నెలతో పాటు ఫిబ్రవరిలో కూడా ఇదే తీరున చౌకధర దుకాణాల్లో బియ్యం మిగులుతున్నాయి.

కొత్త జిల్లాల వారీగా..
కొత్త జిల్లాల వారీగా చూస్తే.. మహబూబ్‌నగర్‌లో 804 చౌకధర దుకాణాలున్నాయి. వీటిలో 3.70 లక్షల ఆహార భద్రత కార్డులుండగా, 8353 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. వీటిలో ప్రతి నెలా వెయ్యి టన్నుల బియ్యం మిగులుతుండగా, వీటి విలువ దాదాపు రూ.3 కోట్ల ఉంటుంది. నాగర్‌కర్నూల్‌లో 558 చౌకధర దుకాణాల్లో 2.28 లక్షల 619 ఆహార భద్రత కార్డులున్నాయి. వీటికి 4,805 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుంటే, 661 టన్నుల బియ్యం మిగుతున్నాయి. వీటి విలువ దాదాపు కోటీ 56 లక్షల రూపాయలవుతుంది. ఇక వనపర్తిలో 324 చౌకధర దుకాణాలుంటే 1,50,635 ఆహార భద్రత కార్డులున్నాయి.

వీటికి నెలకు 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతుండగా, దాదాపు 500 మెట్రిక్ టన్నులు మిగులుతున్నాయి. వీటి విలువ కోటీ 20 లక్షలుగా అంచనా ఉంది. అలాగే జోగుళాంబ గద్వాలలో 333 చౌకధర దుకాణాలుంటే 1,51,902 కార్డులున్నాయి. వీటికి నెలకు 3 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతుంటే ఈ-పాస్ విధానంతో 300 టన్నుల బియ్యం మిగులుతున్నాయి. వీటి విలువ దాదాపు 84 లక్షల రూపాయలవుతుంది. ఇలా ప్రతి నెలా అక్రమంగా తరలుతున్న బియ్యానికి అడ్డుకట్ట పడుతుండటం శుభపరిణామం.

తెరిచిన పుస్తకంలా లెక్క..
ఈ-పాస్ విధానం ద్వారా ప్రతిరోజు బియ్యం ఎంతమందికి పంపిణీ చేశారు.. ఏయే లబ్ధ్దిదారులు తమకు కేటాయించిన కోటా బియ్యం పొందారు. ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాలి.. మిగిలిన కోటా ఎంత.. తదితర లెక్కలు పూర్తిగా ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఉన్నతాధికారులకు తెలిసిపోతున్నాయి. దీంతో డీలర్లపై రోజువారీగా నిఘా పెరిగింది. లబ్ధిదారుల సమ్మతి ఉంటేనే బియ్యాన్ని పక్కదారి మళ్లించేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, డీలర్ల వద్దకు వచ్చిన ప్రతి లబ్ధిదారుడు కూడా వేలి ముద్రలు వేస్తేనే బియ్యం కోటాను డీలర్లు అందజేస్తారు. ఇదిలా ఉంటే.. ఏజెన్సీ ప్రాంతాల్లోనే 5 గ్రామాలకు సిగ్నలింగ్ వ్యవస్థ అందని కారణంగా డీలర్ల ద్వారానే అందిస్తున్నారు. వీటిలో అచ్చంపేట మండలం అక్కారం, బక్కలింగాయపల్లి, కొల్లాపూర్ మండలం అమరగిరి, లింగాల మండలం అప్పాపూర్, పదర మండలం మద్దిమడుగులలో టెలిఫోన్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం వల్ల డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...