పీహెచ్‌సీలలో..మెరుగైన సేవలు

Wed,January 24, 2018 01:18 AM

-ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మరిన్ని సదుపాయాలు
-అందుబాటులోకి రానున్న అల్ట్రాసౌండ్, బీపీ, షుగర్ పరీక్షలు
-నెలకు సరిపడా మందుల అందజేత
-గర్భిణులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందుబాటులో అధునాతన వైద్యం
-గ్రామీణప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చర్యలు
-జిల్లాలోని 9 పీహెచ్‌సీల్లో త్వరలో అమలు
-ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం
-డీఎంహెచ్‌వో డాక్టర్ సునీత

జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి :ప్రభుత్వ దవాఖానలు అంటేనే మొన్నటి వరకు చీదరించుకునేవారు.. ఇక ప్రసవాలు, అత్యవసర చికిత్సలు చేయించాలంటేనే ఎంతో సాహసం చేసినట్టే.. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యం అందేదే కాదు.. బోసిపోయి కనిపించేవి.. అలాంటి వాటిని నేడు తెలంగాణ స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు..

ప్రభుత్వ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యధిక నిధులు కేటాయిస్తుండడంతో అధునాతన సౌకర్యాలు సమకూర్చుతు న్నారు.. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్ పెనుమార్పు తెచ్చింది..నేడు గర్భిణులు పురుడు పోసుకున్నప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు అనేకమార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుండడంతో పల్లెటూళ్లనుంచి పట్టణాలకు వచ్చి పోయేవారు.. ఇప్పుడు ఆ అవస్థలు లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గర్భిణుల కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చెకప్‌లు చేసి, మందులు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. దీంతో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువ కానుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

జిల్లాలోని 12మండలాల పరిధిలో గద్వాలలో ఒక ఏరియా దవాఖాన, అలంపూర్‌లో ఒక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, మిగతా ప్రాంతాల్లో 9 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం గర్భిణులకు అవసరమైన అల్ట్రాసౌండ్ పరీక్షలు, బీపీ, షుగర్ రోగులకు అవసరమైన వివిధ పరీక్షలు కేవలం ఏరియా దవాఖాన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతినెలా పరీక్షలు చేయించుకోవడానికి వీరందరూ జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానపై ఆధారపడాల్సి వస్తున్నది.

పీహెచ్‌సీల్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు


గర్భందాల్చినప్పుటి నుంచి ప్రసవం వరకు నిర్వహించే వైద్య పరీక్షలు చాలా ముఖ్యమైనవి. గర్భంలో బిడ్డ ప్రతి నెలా ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు జరపాల్సి ఉంటుంది. కీలకమైన ఈ పరీక్షలు పీహెచ్‌సీల్లో అందుబాటులో లేవు. దీని కోసం గర్భిణులు గ్రామాల నుంచి పట్టణాలకు రావాల్సి వస్తున్నది. జిల్లాలోని ఏరియా దావాఖానాకు వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే అనర్థాలు జరుగుతున్నాయి. దగ్గరలోని ప్రైవే టు దవాఖానకు వెళితే అల్ట్రాసౌండ్ పరీక్షలకు రూ.700 నుంచి రే.1200 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏదైనా లోపం ఉన్నట్లయితే అదే దవాఖానాలో వైద్యం, కాన్పుకోసం రూ.30వేలకు పైగా వసూలు చేస్తున్నారు. వీటితో పాటు మందులు ఇతరత్రా ఖర్చులకు మరో రూ.10వేలు వరకు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజల కష్టాలు తీర్చేందుకు పీహెచ్‌సీల్లో అల్ట్రాసౌండ్ పరీక్షల సదుపాయం అవసరమని గుర్తించిన ప్రభుత్వం దాని అమలుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ప్రభుత్వ దవాఖానల పరిధిలో 15,678 మంది గర్భిణులు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 2080 మంది పురుడుపోసుకొని కేసీఆర్ కిట్‌లను అందుకున్నారు. కేసీఆర్ కిట్ గర్భిణులకు వరంగా మారడంతో ఏరియా దవాఖానాలతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీల్లో కూడా ప్రసవాల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బీపీ, షుగర్‌కి నెలవారి కిట్లు


పల్లె ప్రాంతల్లోని ప్రజలకు బీపీ, షుగర్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సరైన వైద్య పరీక్షలు చేయించుకోలేక గుండె జబ్బులకు గురవుతున్న వారికి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్ ఉన్నవారికి 104వైద్య సిబ్బంది ద్వారా ప్రతి గ్రామంలో మందులను అందిస్తున్నారు. సర్కారు దవాఖానల్లోనూ 10రోజులకు సరిపడా మందులను అందజేస్తున్నారు. తరచూ దవాఖానకు వెళ్లలేక కొందరు రోగులు మధ్యలోనే మందుల వాడకాన్ని ఆపేస్తున్నారు. ఫలితంగా వ్యాధి తీవ్రమై మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం పీహెచ్‌సీల పరిధిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు జరపాలని నిర్ణయించింది. వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడా మందులను అందజేసేందుకు సిద్ధమైంది.

ఇంటింటికీ తిరుగుతూ పరీక్షలు


బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కారణంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీన్ని గుర్తించిన వైద్య సిబ్బంది నియంత్రణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇందు కోసం ఆశ వర్కర్ల, ఏఎన్‌ఎంల సహాయం తీసుకోనున్నది. వీరు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయితే నెలకు సరిపడా మందులను సర్కారు వైద్యశాలలో ఇస్తారు. అక్కడే ప్రతినెలా పరీక్షలు జరుపుకుని వ్యాధి తీవ్రతకు అనుగుణంగా మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

త్వరలోనే ఏర్పాటు చేస్తాం


ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వీటిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందించేందుకు నిర్ణయమైంది. పీహెచ్‌సీల్లో గర్భిణుల కోసం అల్ట్రాసౌండ్ పరీక్షలు, బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు నెలవారి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం నూతన సదుపాయాలను కల్పిస్తున్నారు. త్వరలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేస్తాం.
- డాక్టర్ సునీత, డీఎంహెచ్‌వో

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles