ఘనంగా ఆంజనేయ స్వామి ప్రభోత్సవం


Tue,January 23, 2018 01:31 AM

ధరూర్ : చింతరేవుల ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలకు భక్త జనం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇష్టదైవాన్ని దర్శించుకొని, దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఆలయ ఆవరణంతా జనసంద్రంతో నిండిపోయింది. ఆంజనేయ స్వామి స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి స్థానిక కోనేటి బావిలో తెప్పోత్సవం నిర్వహించి, అనంతరం ప్రభోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రభపై స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, అశేష భక్త జన వాహిని మధ్య ఊరేగించారు. ఆలయం నుంచి దశమికట్ట వరకు స్వామి వారి ప్రభోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం రాత్రి నిర్వహించనున్న రథోత్సవానికి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ భక్తులు నిండిపోయారు. కొత్త కుండలో, కొత్త ధాన్యం తో అన్నం వండి, స్వామివారికి దాసంగాలు (నైవేధ్యం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. రథోత్సవాన్ని పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సోమవారం అర్థరాత్రి నుంచి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ పరిసర గ్రామాల భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి భక్త జనం స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రత్యేక వాహనాలలో తరలివస్తున్నారు. ఎస్‌ఐ మురళీగౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధర్మకర్త గిరిరావు, అర్చకులు భీంసేనాచారి, ఈవో రామన్‌గౌడ్, సిబ్బంది వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...