నేర నియంత్రణకు..


Sun,January 21, 2018 11:38 PM

-ఎస్పీ పర్యవేక్షణలో కొనసాగుతున్న పాత నేరస్తుల సమగ్ర సర్వే
-జిల్లాలో 1000మంది పాత నేరస్తుల గుర్తింపు
-ఇప్పటి వరకు 450మందితో వివరాల నమోదు
-పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా వివరాల సేకరణ
-జిల్లాలో పదేళ్ల కదలికలపై ఆరా
-మరో మూడు నాలుగు రోజుల్లో పూర్తి కానున్న సర్వే
-సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు

గద్వాల క్రైం : రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 18న ప్రారంభమైన పాత నేరస్తుల సమగ్ర సర్వే జిల్లాలో ఎస్పీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ పర్యవేక్షణలో 14 మండలాల్లో కొనసాగుతోంది. మూడు రోజులుగా జిల్లాలో ఆయా పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసుల ఆధారంగా నేరస్తుల వివరాలు సేకరించడానికి జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలో నమోదైన కేసులను బట్టి మొత్తంగా 1000 మంది నేరస్తులున్నారని పోలీసులు గుర్తించారు. నేర రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర సర్వేను కట్టుదిట్టంగా కొనసాగేలా ఎస్పీ చర్యలు చేపట్టారు. పదేళ్ల నుంచి ప్రస్తుత గడియ వరకు ఎవరైతే నేరస్తులుగా పోలీసు స్టేషన్‌లో నమోదై ఉన్నారో వారి ప్రతి కదలికను తెలుసుకునేందుకు వారి వేలిముద్రను, ఇంటి చిరునామాను జియోట్యాగ్ చేయడంతో పాటు పూర్తి స్థాయి సమాచారాన్ని టీఎస్ కాప్ యాప్‌లో నమోదు చేస్తున్నారు.

నేరస్తుల మార్పు కోసమే పోలీసు శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ తరహాలో నేరస్తుల కదలికలకు సంబంధించి టీఎస్ కాప్ మొబైల్ యాప్ ద్వారా పూర్తి స్థాయిలో నిర్వహించిన దాఖాలలు లేవు. కాబట్టి శాంతి భద్రతలు, ప్రజలకు పూర్తి రక్షణగా ఉండేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నేరస్తుల వివరాలు సేకరించేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు జిల్లాలో 14 మండలాల్లో ఉన్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాబడిన నేరస్తుల వివరాలు సేకరించడంలో బీజీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన సమగ్ర నేరస్తుల సర్వేపై బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నేరం చేసిన వారు.. చేయ బోయే వారు భయపడాల్సిందే తప్ప.. నేరం చేసి తప్పు తెలుసుకొని మారిన వారి వారు.. ప్రశాంతమైన జీవనం కొనసాగించాలనుకునే వారు భయపడాల్సిన అవసరం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టడంతో పాటు భవిష్యత్తులో తిరిగి ఎలాంటి నేరాలు జరుగకుండా ఉండేందుకు సర్వే ఉపయోగపడనుందని చెబుతున్నారు. ఏదేమైనా పోలీసు శాఖ చేపడుతున్న సమగ్ర నేరస్తుల సర్వే వల్ల కరడుకట్టిన నేరగాళ్ల గుండెల్లో వణుకుపుడుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఎస్పీ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో ఏఎస్పీ భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావు, గద్వాల సీఐ వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి సీఐ వెంకటేశ్వరరావు, అలంపూర్ సీఐ రజితలతో పాటు ఆయా పోలీసు స్టేషన్‌ల ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ, సిబ్బంది గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే ద్వారా 450 మంది నేరస్తుల వివరాలు సేకరించారు. మరో మూడు రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ కార్యాలయ పోలీసు అధికారులు చెబుతున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...