సరస్వతీ..నమోస్తుతే


Sun,January 21, 2018 11:35 PM

గద్వాల టౌన్ : చదువులతల్లి, సకలజన కల్పవల్లి సరస్వతి.. కళల కాణాచి, విజ్ఞాన వీక్షి సరస్వతి.. వాక్కుకు, బుద్ధికి విజ్ఞానానికి, వివేకానికి కళలకు అధినేత్రి సరస్వతి.. వాణిగా, గీర్వాణిగా, వాగ్దేవిగా, విధివల్లభగా, బ్రాహ్మణిగా, భారతిగా అమ్మ సాధించిన కీర్తి అనితర సాధ్యం.. అమ్మ మహిమానిత్వాన్ని, విశిష్టతను రుగ్వేదం, బ్రహ్మ వైవర్త పురాణం, దేవిభాగవతం, పద్మపురాణం వేనోళ్ల పొగిడాయి. కీర్తించాయి.. అందుకే సరస్వతీ దేవిని దర్శించుకున్నంతనే సకల విద్యలు సిద్ధిస్తాయన్నది ప్రజల నమ్మకం.. అంతటి మహిమానిత్వం గల శ్రీ సరస్వతీ అమ్మ వారు పుట్టిన రోజు మాఘశద్ధ పంచమి, మనకెంతో శుభదినం.. ఈ పంచమినే నేడు మనందరం వసంత పంచమిగా, శ్రీ పంచమిగా జరుపుకుంటున్న సందర్భంగా మీ కోసం..

పంచమితో ప్రకృతి కదలిక
త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేశాక చరాచర జీవరాశి సంసద యావత్తు నిశ్శబ్దంగా ఉంది. ఆయా జీవ జాతులకు సంబంధించిన సహజమైన శబ్ధాలున్నప్పటికీ భాషాప్రయుక్త, భావ ప్రకటన శబ్ధం మాత్రం లేదు. శబ్ధానికి అర్థం ఉండాలన్న బ్రహ్మ తలంపు మేరకు తన ఊహల్లో మెదిలిన సరస్వతి ఆవిర్భావానికి శ్రీకారం చుడుతాడు. కమండలంలోని మంత్రజలాన్ని ప్రకృతిపై చల్లుతాడు. దీంతో వీణాధారి సరస్వతీ దేవి జన్మిస్తుంది. వీణానాదంతో చెట్లకు చిగురు తొడిగి ప్రకృతి కొత్త సొగబగులు అద్దుకుంటుంది. ఈ విషయాన్ని సూచిస్తూ వసంతపంచమి వేడుకలు జరుపుకుంటారు. వసంతపంచమి నాడు అమ్మ జన్మించినందుకు గాను శ్రీ పంచమిగా, వసంత పంచమిని జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి.

అమ్మవారి ప్రత్యేకత
సరస్వతీదేవి చేతిలో ఉన్న చిలుక గురువు చెప్పిన దానిని రెండు సార్లు మననం చేస్తూ ఉండమని సూచిస్తుందని, అక్షరమాల- గ్రహించిన విషయాలను పలుమార్లు మళ్లీ, మళ్లీ స్మరించుకోవాలని సూచిస్తుందని, గ్రంథం- విన్నదానికంటే మరికొంత సమచారాన్ని గ్రంథాల ద్వారా తెలుసుకోవాలని సూచిస్తుందని, అలాగే అమ్మవారి చేతిలోని వీణ నిరంతరం వాద్యధ్వనిని చేస్తూ ఉన్నట్లయితే ఆ సంగీతం విన్న వ్యక్తికి కరతాలామలకం అవుతుందని ఇలా అమ్మవారి విశిష్టతను పండితులు వివరిస్తున్నారు.

పిల్లలకు శుభం
వసంతపంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో తమ పిల్లలు వృద్ధి సాధిస్తారని ప్రజల నమ్మకం. జ్ఞానమూర్తి సరస్వతి అండ ఉంటే విద్యాకటాక్షం పుష్కలంగా లభిస్తుందన్నది ప్రజల విశ్వాసం. ఆ కారణం చేతనే పుస్తకాలు, పలకలు అన్ని కూడా సరస్వతీ దేవి ముందు ఉంచి ప్రార్థిస్తారు. దీంతో ఎలాంటి అవాంతరాలు కలగకుండా విద్య ప్రసాదించాలని కోరుకుంటారు. అందుకు గాను వసంత పంచమి నాడు ప్రత్యేకంగా పిల్లలకు సరస్వతిదేవీ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తారు.

జ్ఞాన సరస్వతి ఆలయంలో పూజలు..
మాఘమాసం శుద్ధపంచమి, వసంతపంచమి సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 5గంటలకు అమ్మవారికి అభిషేకం, 6గంటలకు విశేష అలంకరణ, హారతి, 8గంటలకు సామూహిక అక్షరాభ్యాసం, 1గంటకు ప్రసాద వితరణ, సాయంత్రం 7గంటలకు ఉంజల్ సేవ నిర్వహిస్తారు.

ముస్తాబవుతున్న ఆలయాలు..
వసంతపంచమిని పురస్కరించుకుని బీచుపల్లిలోని శ్రీహయగ్రీవ సరస్వతీ ఆలయంతో పాటు జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ పంచమి వేడుకలు జరుపుకునేందుకు ముస్తాబవుతున్నాయి. అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు, పిల్లలచేత అక్షరాభ్యాసం చేయించేందుకు అనేక మంది భక్తులు ఆలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అర్చకులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అలాగే సరస్వతి పీఠాలు, పాఠశాలల్లో పంచమి వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

ఈ మాసంలో అన్నీ శుభాలే..
హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శుభదినాలు, పండుగల్లో వసంతపంచమి ఒకటి. వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఎందుకంటే వసంత పంచమినాడే శారదాంబ జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు దేవతా స్వయం సిద్ధ ముహూర్తమని పండితులు వెల్లడిస్తున్నారు. మాఘమాసమంటేనే శుభకార్యాలకు అనువైన మాసమని పండితులు చెప్తుంటారు. ఈ నెలంతా మంచి రోజులుగానే భావిస్తారు. ఈ రోజు నుంచి గృహాప్రవేశంతో మొదలు పెడితే, వివాహాలు, నామకరణాలు, నిశ్చితార్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభకార్యాలు వేలాదిగా జరుగనున్నాయి.

బాసర తరువాత గద్వాల జిల్లాలో..
జోగుళాంగ గద్వాల జిల్లాలోని కృష్ణానది తీరాన జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బీచుపల్లి క్షేత్రంలో ఉన్న సరస్వతీ ఆలయంలో అక్షర శ్రీకారం చుట్టడానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. అదిలాబాద్ జిల్లాలోని బాసర తరువాత గద్వాల జిల్లాలోనే సరస్వతీ ఆలయం ఉండడం, జాతీయ రహదారి పక్కన ఆలయం ఉండడంతో బీచుపల్లికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...