పత్తి వద్దు.. ప్రత్యామ్నాయం ముద్దు !


Sat,January 20, 2018 02:48 AM

-గులాబీ పురుగు ఉధృతిపై సర్వత్రా ఆందోళన
-పంటకాలాన్ని పొడిగించవద్దంటున్న అధికారులు
-పెరుగుతున్న ధరలతో పత్తిపంటపై అన్నదాతల ఆశలు
-గులాబీ పురుగుతో అపారమైన నష్టాలు
-జిల్లాలో 1,20,000 ఎకరాల్లో పంటసాగు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పత్తిపంటను ప్రభుత్వం తొలగించాలని సూచిస్తున్నది. ప్రతి ఏడాది పెరుగుతున్న గులాబీ రంగు పురుగు ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పత్తిపంటను వీలైనంత తొందరగా పూర్తిగా తొలగించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయాశాఖ అధికారులను ఆదేశించింది. గులాబీ పురుగు ప్రభావం తరువాత వేసే పంటలపై తీవ్రంగా చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటను సాగుచేయాలని చెబుతున్నారు. పత్తి పంట ఎక్కువ మొత్తంలో చేతికి వస్తుందని ఆశపడితే అసలుకే మోసం వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1,20,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా ప్రస్తుతం క్వింటాలుకు రూ. 4800నుంచి రూ.5000 వరకు ధర చెల్లిస్తున్నారు.

రైతులు వివిధ పత్తి రకాలను సాగు చేయడంతో పంట చేతికి వచ్చే కాల పరిమితుల్లో భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రకాల పత్తిపంటలు నీటి వసతిని బట్టి దీర్ఘకాలం పాటు దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయకుండా అదే పంటకాలాన్ని పొడిగిస్తుంటారు. దీంతో అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పంటను తొలగించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రక్రియతో ప్రతి ఏడాది తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఉధృతికి పంటకాలాన్ని పొడిగించడమే కారణమంటున్నారు. జనవరి మొదటి వారం పత్తి పంట సాగు సమయం ముగిసిపోవడంతో ఆరుతడి పంటలను సాగు చేయాల్సిందిగా సూచిస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో అంతంత మాత్రంగానే పలికిన పత్తి పంట ధరలు వారం రోజులుగా పైపైకి రావడంతో అన్నదాతాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో నీటి వసతి ఉన్న రైతులు నీటి తడులను అందిస్తూ పత్తి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు మూడు మాసాల పాటు పంటను కాపాడితే అదనంగా ఆదాయంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతేడాది చివర్లో క్వింటాల్ పత్తి ధర రూ. 6000 వరకు పలకడంతో రైతులు పంట కాలాన్ని పొడిగిస్తున్నారు. దీంతో గులాబీ పురుగు ఉధృతి పెరిగిపోయి ఈ ఏడాది దిగుబడులపై ప్రభావం చూపిందంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా ఈ సారి కూడా ధరలు కలిసి రావడంతో పంటను తొలగించేదుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో కొందరు రైతులు పంట కాలాన్ని పొడిగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పొడిగించవద్దంటున్న అధికారులు : గులాబీ పురుగు ఉధృతి పెరిగిపోవడంతో పంటకాలాన్ని పొడిగించవద్దని అధికారులు పదేపదే చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు పంటను ఉంచడంతో గులాబీ పురుగు జీవిత కాలం పెరిగి రాబోయే పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు కూలీల కొరత కారణంగా పంటను తీయలేకపోతున్నారు. అలాగే పంటను తొలగించేదుకు కూడా ఖర్చుభారం పెరిగిపోవడంతో నిర్లక్ష్యంగానే వదిలేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో పత్తి కర్రను తొలగించకపోవడంతో గులాబీ రంగు పురుగు ఉధృతికి కారణమవుతున్నది.

పెరిగే కొద్ది గులాబీ రంగులోకి.. : కాయ తొలుచు తల్లిపురుగు ముదురు గోధుమ రంగులో ఉండి ముందు రెక్కల పై భాగంలో నల్లని మచ్చలు ఏర్పడుతాయి. ఇవి సుమారుగా 400 గుడ్లను విరివిగా, గుంపులు గుంపులుగా మొక్కల ఆకులు, మొగ్గలు, కాయ తొడిమలపై పెరుగుతాయి. ఈ గుడ్డు నుంచి 3 నుంచి 7రోజుల్లో అద్దెపురుగులు వెలువడి తెల్లగా ఉండి పెరిగే కొద్ది లేత గులాబీ రంగు పూర్తిగా ఎదిగిన లద్దెపురుగు ముదురు గులాబీ రంగులోకి మారుతాయి. లద్దె పురుగుల కాయల పై భాగంలో రంధ్రం చేసి లోపలికి వెళ్లి మొత్తం నాశనం చేస్తాయి. తరువాత బయటకు వచ్చి రాలి ఆకుల్లో, కాయల్లో కోశస్థ దశకు చేరుకుంటాయి. వీటి నుంచి 8 నుంచి 10రోజుల్లో రెక్కల పురుగులు బయటకు వస్తాయి. ఆడ రెక్కల పురుగులు 50రోజుల పైబడి, మగ పురుగులు 20 రోజుల వరకు జీవిస్తాయి.

పురుగు ఉధృతికి ప్రధాన కారణాలు

-ఇవి బీటీ ట్యాక్సిని తట్టుకొనే శక్తిని పెంచుకుంటాయి.
-ఎక్కువ కాల పరిమితి పంటలను సాగు చేయడం ద్వారా వ్యాపిస్తాయి
-నాన్ బీటీ రకాలను బీటీ పత్తి పొలం చుట్టూ విత్తకపోవడం వలన పెరుగుతాయి.
-పంట తరువాత పత్తి మొదళ్లను తీసివేయకుండా చాలాకాలం అలాగే ఉంచడం.
-ఈ పురుగు ఆశించే మొగ్గ, పూలు, కాయలు, బీటీ విషం ఉత్పత్తికాకాపోవడం
-ఎఫ్1 రకం హైబ్రిడ్ పత్తి కాయల్లో కొన్ని గింజలు జన్యుపరమైన సెగ్రిషన్ వనల బీటి కానివిగా ఉండటం
గులాబీ పురుగు నివారణకు జాగ్రత్తలు
-పత్తి తీసిన తరువాత చేనులో పశువులను, గొర్రెలను, మేకలను మేపాలి.
-పత్తి మొదళ్లను ట్రాక్టర్ రోబోవేటర్లతో భూమిలో కలియదున్నాలి. తద్వారా గులాబీ రంగు పురుగు శేశస్ధ దశలో నాశనం అవుతాయి.
-నీటి వసతి ఉంటే పత్తిపంటను పొడిగించకుండా ఆరుతడి పంటలను వేసుకోవాలి.
-పత్తి పొదళ్లను నిలువ చేసుకొని వంట చెరుకుగా వాడరాదు. పొదళ్లను పంటలోనే తగుల బెట్టాలి.
-చేను చుట్టూ గట్ల మీద ఉన్న తుత్తర బెండ, ఇతర కలుపు మొక్కలు తీసివేయాలి. దీని ద్వారా పురుగు మొత్తం నాశనం అవుతుంది.
త్వరగా తీసివేయాలి
పత్తి పంటను ఎక్కువ కాలం పొడిగించడం వలన చాలా నష్టాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా రైతులు వీటిని తీసివేయాలి. గు లాబీ రంగు పురుగు వలన వచ్చే సారి సాగు చేసి పంటలకు తీవ్ర ప్రభాం చూపుతుంది. అందుకని పత్తిపంటను ఎక్కువకాలం సాగు చేయడం వల్ల ఇతరపంటలపై తీవ్రప్రభావం చూపుతుంది.
-ఖాద్రి, వ్యవసాయాధికారి

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...