నూతన ఓటర్లపై దృష్టి సారించండి

Thu,January 12, 2017 01:49 AM

-1952 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో అనేక మార్పులు
-సామాన్య ప్రజలకు సలహాలు, సూచనలివ్వండి
-ఎన్నికల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు
-ప్రతి పౌరుడూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
-మీ సేవా కేంద్రాల్లో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ
-ఎన్నికల ముఖ్య కార్యదర్శి భన్వర్‌లాల్

మహబూబ్‌నగర్ జెడ్పీ సెంటర్ : భారత ఎన్నికల కమిషన్ నూతన ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బూత్ లెవల్‌లో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి భన్వర్‌లాల్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. సామా న్య ప్రజల మేలు జరిగే సలహాలు, సూచనలు, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వస్తే భవిష్యత్తు తరాలకు మంచి ఫలితాలు అందుతాయని ఎన్నికల కమిషన్ భావిస్తుందన్నారు.

2014 ఎన్నికల్లో రూ.800 కోట్లను ఎన్నికల సంఘం వెచ్చించడం జరిగిందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోబపెట్టేందుకు రవాణా చేస్తున్న రూ.360 కోట్లను సీజ్ చేసి 11,243 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో చట్ట విరుద్దంగా వ్యవహరించిన ఎంతటి వారైన శిక్షకు గురి కావల్సిందేన్నారు. అక్రమాలు లేని సమాజం కోసం ప్రతి పౌరుడూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. అన్ని మండ ల కేంద్రాలు, గ్రామాలు, మీ సేవా కేంద్రాలలోనూ నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల ఎన్నికల వివరాలను ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. వచ్చే ఎన్నికలలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారే ప్రభుత్వాల ఏర్పాటు చేయడంలో ముఖ్యభూమిక పోషించనున్నారన్నారు. ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల జేసీ సంగీత, నారాయణపేట్ సబ్ కలెక్టర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...