ఆధునిక సేద్యంపై ఆసక్తి


Thu,January 12, 2017 01:42 AM

-జీరో టిల్లేజ్‌తో వరి కొయ్యల్లో మొక్కజొన్న విత్తులు
-వ్యవసాయ అధికారుల సూచనలతో అధిక దిగుబడులు
-రైతన్నకు తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి, ఆదాయం
-పంటల మార్పిడికి సాగుకు ఎంతో దోహదం

గద్వాల, నమస్తే తెలంగాణ : ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు పండించే వైపు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు చెబుతున్నా రైతులు వరి వైపే మొగ్గు చూపుతూ వరిని అధికంగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే తుకాలు పోసి, కరిగెట పనుల్లో బిజీగా ఉన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున పంటలు చేతికొచ్చే సమయంలో నీరు పంటలకు అందక ఎండిపోయి రైతులు నష్టపోతారని అధికారులు ముందస్తు సూచనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తక్కువ పెట్టుబడి, సమయం ఆదా, కూలీల ఖర్చు అంతగా అవసరం లేకుండా రైతులకు మేలు చేకూర్చే పంటలను సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో యాసంగిలో కేవలం వరి పంటలు వేసి ఇతర పంటలు ఏం సాగు చేయాలో తెలియక సతమతమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులకు వ్యవసాయ అధికారులు జీరో టిల్లేజీ విధానం గురించి వివరిస్తూ ఆ పద్ధతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానంలో మొక్కజొన్న సాగు గురించి వివరిస్తూ పంటపై శిక్షణ ఇస్తున్నారు. గ్రామ గ్రామాన తిరిగి జీరో టిల్లేజీ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.

వరి పంట కోసిన తర్వాత ఎటువంటి సేద్యం చేయకుండా ఎరువులు వేయకుండా వరి కొయ్యల్లోనే ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రం ద్వారా విత్తనాలను వరుస క్రమంలో విత్తే విధానాన్ని రైతులకు వివరిస్తూ సమయం ఆదా చేయడంతో పాటు ఖర్చులు తగ్గే వ్యవసాయం వైపు రైతులను మల్లిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కింద వరి పంటలు సాగు చేసే గద్వాల, ధరూర్, ఇటిక్యాల, మానవపాడు మండలాల్లో ని రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తూ జీరో టిల్లేజీ విధానం ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులను ఒప్పిస్తూ పంటలు వేయిస్తున్నారు. ఈ పద్ధతిలో పంట సాగు చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..

జీరో టిల్లేజ్ విధానంలో కలిగే లాభాలు..


వరి కొయ్యల్లో జీరో టిల్లేజ్ విధానం ద్వారా మొక్కజొన్న విత్తనాలు విత్తడం వల్ల పంటమార్పిడి చేసినట్లు అవుతుంది. దీని తర్వాత వేసే పంటకు చీడపీడలు ఆశించే అవకాశం ఉండదు. దీంతో పంట మంచిగా పండి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో మొక్క జొన్న విత్తడం వల్ల ఎకరాకు 20నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.
- గతంలో వేసిన వరి పంటకు అధిక మొత్తంలో ఎరువులు, రసానిక మందులు వాడడం వల్ల రైతులు ఎక్కువగా మందులు వేసే అవకాశం ఉండదు. ఎరువుల ఖర్చులు సుమారు రూ.2వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
- ఎటువంటి సేద్యం చేయకుండా వరి కొయ్యల్లో విత్తనాలు నాటడడం వల్ల సేద్యపు ఖర్చులు సుమారు రూ.2వేలనుంచి రూ.4వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
- సుమారు 15రోజుల సేద్యపు సమయం ఆదా అవుతుంది.

యాజమాన్య పద్ధతులు


- వరి కొయ్యల్లో మొక్కజొన్న విత్తనం విత్తన 48 గంటల్లోపు అట్రిజీన్ ఒక కేజీ, 1000 ఎంఎల్ పారాక్వాట్ 1000మీమీ, ఒక లీటర్ నీటిలో తేమ శాతం పాటిస్తూ పిచికారి చేయాలి.
- విత్తనం మొలకెత్తిన 30 రోజుల నుంచి 40 రోజుల లోపు కార్బోఫ్యూడన్ 3 జీ గుళికలు 4 నుంచి 5 కిలోల సుడిలో వేయాలి. దీని వల్ల కాండం తొలుచు పురుగు అరికట్టవచ్చని వ్యవసాయ అధికారి మల్లారెడ్డి తెలిపారు. ప్రతి రైతు జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని ఆయన చెప్పారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS