నేటి నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆమరణ నిరాహార దీక్ష


Thu,January 12, 2017 01:41 AM

-సమస్యలపై స్పందించకపోవడం బాధాకరం
-కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కలీముల్లా

గద్వాల న్యూటౌన్: అపరిష్కృత సమస్యలపై కాంట్రాక్ట్ లెక్చరర్లు పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, ప్రభుత్వ తీరుకు నిరసనగా నేటి నుంచి ఆమరణ దీక్ష చేపడుతామని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు కలీముల్లా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గద్వాల ఆర్డీవో కార్యాలయం ముందు సంఘం నాయకులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. బుధవారం సమ్మెలో షకీల్, రాజేందర్, చంద్రశేఖర్, కృష్ణయ్యలు కూర్చున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కలీముల్లా మాట్లాడుతూ దశాబ్దన్నర కాలంగా ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా నాణ్యమైన బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తున్నామన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ తమ పాత్ర లేకపోలేదన్నారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడం తమ కలిచివేస్తోందని కలీముల్లా ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు.

తమ డిమాండ్లను నెరవేర్చడంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్న ప్రభుత్వ పనితీరుకు నిరసనగా 14 నుంచి ఆమరణదీక్షకు పూనుకునేందుకు నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. వీరికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు మోహన్ సంఘీభావం తెలిపారు. అనంతరం కాంట్రాక్టు లెక్చరర్లు జాయింట్ కలెక్టర్ సంగీతను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన నిరవధిక సమ్మె వల్ల పరీక్షల నిర్వహణతో పాటు, విద్యార్థులకు జరుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని జేసీ తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చక్రపాణిరెడ్డి, నాయకులు రామాంజనేయులుగౌడ్, నర్సింహులు, మహేంద్రగౌడ్, శివ, దేవుజ, బిక్యానాయక్, భాస్క్‌ర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS