తుమ్మిళ్ల లిఫ్ట్ ఓ వరం


Wed,January 11, 2017 02:31 AM


వడ్డేపల్లి : తుమ్మిళ్ల లిఫ్ట్ రైతులకు ఓ వరంగా మారనుందని, ఎత్తిపోతల ఏర్పాటుకు ఆర్థిక శాఖ అనుమతి లభించిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మంద జగన్నాథం అన్నారు. మండల కేంద్రంలోని వైస్ ఎంపీపీ శ్రీనివాసులు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సమయంలో ఆర్డీఎస్‌ను బాగుచేసి సాగునీటిని పూర్తి స్థాయిలో అందించి రైతుల పంటల కళకళలాడుతూ ఉంచేలా ఆనాడే హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. ఈ మేరకు రాజోళి మండలంలోని తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నీటిని ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లందించేలా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ లిఫ్ట్ ఏర్పాటుకు పలుసార్లు సీఎం కేసీఆర్‌తో, మంత్రి హరీశ్‌రావుతో చర్చించి నా వంతు కృషి చేశానన్నారు.తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మల్లమ్మకుంట, జూలేకల్, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించడానికి రూ.783 కోట్లు కేటాయించిందన్నారు. ఈ లిఫ్ట్ కింద సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించనుందన్నారు.

సమగ్ర ప్రాజెక్ట్ వివరాలు..


లిఫ్ట్ కెనాల్‌కు విద్యుత్, సివిల్ వర్క్, లైన్, లింకేజ్ రెగ్యులేటర్ నుంచి డెలివరీ కోసం రూ.478 కోట్లు, అప్రోచ్ కెనాల్-సుంకేసుల రిజర్వాయర్ నుంచి సర్జిపుల్‌కు రూ.7కోట్ల38లక్షలు, మల్లమ్మ కుంట నుంచి ఆర్డీఎస్ ఫీడర్‌కెనాల్‌కు రూ.98 లక్షలు, మల్లమ్మ కుంట రిజర్వాయర్ బండ్ కోసం రూ.50 కోట్ల40 లక్షలు, మెయిన్ కెనాల్ నుంచి మల్లమ్మకుంట వరకు కట్టడానికి రూ.7కోట్ల25లక్షలు, మల్లమ్మకుంట నుంచి జూలేకల్ మెయిన్ కెనాల్ కోసం రూ.17 కోట్ల 85 లక్షలు, జూలేకల్ నుంచి ఆర్డీఎస్ ఫీడర్ చానల్ కోసం రూ.9 కోట్ల 40 లక్షలు, జూలేకల్ నుంచి వల్లూరు మెయిన్ కెనాల్ కోసం రూ. 9 లక్షల40 వేలు, జూలేకల్ రిజర్వాయర్ కట్టడం కోసం రూ.13 కోట్ల 81లక్షలు, వల్లూరు రిజర్వాయర్ కోసం రూ.24కోట్ల 85 లక్షలు, మెయిన్ కెనాల్ మల్లమ్మ కుంట నుంచి జూలేకల్ వరకు ఏర్పాటు స్టక్చర్స్ కోసం రూ.13 కోట్ల 40 లక్షలు, జూలేకల్ నుంచి వల్లూరు స్ట్రక్చర్ కోసం రూ.51 కోట్ల 30లక్షలు అంచనా వేశామన్నారు. 524 ఎకరాల స్థలం కోసం రూ.26 కోట్ల 20 లక్షలు, 1998 ఎకరాల స్థలం కోసం రూ.99 కోట్ల 90 లక్షలు కేటాయించారన్నారు.

తుమ్మిళ్ల లిఫ్ట్ మూడు రిజర్వాయర్ల ద్వారానే సాగు నీరందుతుందని, గ్రావిటీ కెనాల్ ద్వారా ఇవ్వాలనే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. నడిగడ్డ రైతుల తరపున కేసీఆర్, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, ఆత్మలింగారెడ్డి, ఎంపీటీసీ రామన్, వెంకట్రామన్ గౌడ్, రామిరెడ్డి, గిడ్డారెడ్డి పాల్గొన్నారు.

232
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS