గుడ్డు మాయం..!


Sun,December 15, 2019 02:46 AM

-పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూకు తూట్లు
-ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
-పక్కదారి పడుతున్న గుడ్డు
-విద్యార్థులకు అందని పౌష్టికాహారం
-పటించుకోని ఉన్నత అధికారులు
రేగొండ, డిసెంబర్‌ 14 : విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు బాల్య దశలోనే పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తోంది. ఇం దులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యంతో సరిపెట్టగా రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తోంది. ప్రత్యేక మెనూ తయారు చేసి అమలు చేస్తోంది. కాగా, మధ్యాహ్న భోజన తయారీ బాధ్యతలు తీసుకున్న నిర్వాహకులు మెనూకు తీట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు విద్యాశాఖ సైతం వంతపాడుతుందనే ఆరోపణలు లేకపోలేదు. పర్సంటేజీలకు అలవాటుపడిన అధికారులు వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. నిబంధనల మేరకు రోజువారీగా వచ్చిన విద్యార్థులకు అనుగుణంగా సరిపడా బియ్యం వండాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా నిర్వాహకులు తక్కువ బియ్యం వండుతూ విద్యార్థుల పొట్టకొడుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన బియ్యాన్ని కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఉపాధ్యాయుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు వినికిడి. ఇంతటితో ఆగని నిర్వాహకులు గుడ్డుకు సైతం ఎగనామం పెడుతూ వారే మింగేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కుమ్మక్కై విద్యార్థుల పొట్టగొట్టడంపై ఆయాపాఠశాలల పరిధిలోని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పౌష్టిక విలువలు పెంచేందుకు...
మెనూలో భాగంగా సన్నబియ్యంతోపాటు వారంలో మూడు గుడ్లు, ఆకుకూరలు ఇతర కూరగాయలతో ప్రభుత్వం ప్రత్యేక మోనూ తయారు చేసింది. ఆ మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందించాల్సి ఉన్నప్పటికీ సన్నబియ్యం, గుడ్లను నిర్వాహకులు మింగేస్తూ విద్యార్థుల పొట్టకొడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో తక్కువ ధరలకు లభించే కూరగాయలతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. రేగొండ మండల పరిధిలో ప్రాథమిక పాఠశాలు 31, ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ఉన్నత పాఠశాలలు10 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 3984 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 49పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గాను నెలకు 85క్వింటాళ్ల సన్నబియ్యం, వారానికి 8400గుడ్లకు చెల్లింపులు జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఒకటి రెండు గ్రామాల్లో మినహా మిగతా గ్రామాల్లోని పాఠశాలల్లో వారానికి ఒక టి, లేదా రెండు గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో వా రంలో నాలుగు వేలకు పైగా గుడ్లకు సంబంధించిన బిల్లు లు, 50శాతం బియ్యాన్ని నిర్వాహకులు, పెద్దసార్లు కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ పాటిస్తున్నట్లు లెక్కలు చూపుతూ సన్నబియ్యం, గుడ్లకు సంబంధించిన బిల్లులు నిర్వాహకులు స్వాహా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలను పక్కదారి పట్టిస్తూ విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తున్నప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ధరలు పెరిగినా వారానికి మూడురోజులు గుడ్డు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నిర్వాహకులు మాత్రం ఉపాధ్యాయుల సహకారంతో వారంలో ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు నెలల తరబడిగా బిల్లులు రావడం లేదని, విద్యార్థులు ఎక్కువగా లేక కనీస కూలీ పడడం లేదని, దీంతో వారానికి మూడు గుడ్లు ఇవ్వడం లేదని నిర్వాహకులు బహిరంగానే చెబుతుండడం విశేషం.

మెనూకు తూట్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ స్వలాభం కోసం మెనూ సక్రమంగా అమలు చేయక విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం గుడ్డు, సాంబారుతో భోజనం, మంగళవారం ఆకుకూరలు, బుధవారం గుడ్డు, ప ప్పు, గురువారం ఆకుకూరలు. సాంబారు, శుక్రవారం గుడ్డు, కూరగాయలు, శనివారం పప్పు, ఆకుకూరలతో విద్యార్థులకు భోజనం అందించాలి. కానీ, ఎక్కడ కూడా ఈ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. నిర్వాహకులు ఈ నిబంధనలు పాటించకుండానే మెనూప్రకారం బిల్లులు కాజేస్తున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారంలో మూడు గుడ్లకు బదులు ఒకటి రెండు మాత్రమే ఇస్తూ బిల్లులు మాత్రం మెనూ ప్రకారం స్వాహా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles