లక్ష్మీ పంప్‌హౌస్‌ టు సరస్వతీ బరాజ్‌


Thu,December 12, 2019 02:25 AM

కాళేశ్వరం/ మహదేవపూర్‌, డిసెంబర్‌ 11: లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌ నుంచి సరస్వతీ (అన్నారం) బరాజ్‌కు నీటి తరలింపు నిరంతరం కొనసాగుతున్నది. బుధవారం నాలుగు మోటర్ల ద్వారా 8,480 క్యూసెక్కుల నీటిని అన్నారం తరలించారు. పంప్‌హౌస్‌లో 3వ, 5వ, 9వ, 11వ మోటర్లు నడిపించారు. మోటర్ల నుంచి వస్తున్న నీరు గ్రావిటీ కెనాల్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద 8 పైపుల నుంచి వడివడిగా దూకుతూ గ్రావిటీ కెనాల్‌ నుంచి సరస్వతీ బరాజ్‌కు తరలుతున్నది. సరస్వతీ బరాజ్‌లో బుధవారం 7.39 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇన్‌ఫ్లో 8460 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 5 మోటర్ల ద్వారా 10,600 క్యూసెక్కులు ఉన్నట్లు ఇంజినీర్లు వెల్లడించారు. అలాగే, అంబట్‌పల్లి పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష్మీ బరాజ్‌లో బుధవారం 4.310 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం లక్ష్మీ బరాజ్‌ గేట్లను మూసివేసినట్లు తెలిపారు. బరాజ్‌లోకి వచ్చిన నీటిని లక్ష్మీ పంప్‌హౌస్‌ ద్వారా సరస్వతీ బరాజ్‌కు పంపింగ్‌ చేస్తున్నామని, బరాజ్‌లో 94.800 మీటర్ల ఎత్తులో నీరు ఉన్నట్లు తెలిపారు. లక్ష్మీ బరాజ్‌ ఫ్లడ్‌లైట్ల బిగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బరాజ్‌ వంతెనపై 16.32 మీటర్ల పొడవునా ఇరువైపులా లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పది రోజులుగా లైట్ల పనులు కొనసాగుతున్నాయి. దీంతో వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వారధిగా లక్ష్మీ బరాజ్‌ ఉన్నది. రాబోయే రోజుల్లో ఇరురాష్ర్టాల ప్రజల రాకపోకలు ముమ్మరం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రవాణాకు వీలుగా ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజుల పాటు పనులు కొనసాగే అవకాశాలు ఉండడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇరురాష్ర్టాల సమీప గ్రామాల ప్రజలు కొంత ఇబ్బందులు పడుతూ కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా తిరిగి వెళ్తున్నారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles