11న రూరల్‌ జిల్లాకు మంత్రి కేటీఆర్‌


Mon,December 9, 2019 02:01 AM

-సంగెం మండలం రామచంద్రాపురానికి రాక
-డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ప్రారంభోత్సవం
-పాల్గొననున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌
-రూ. 5.03 కోట్ల వ్యయంతో 80 ఇండ్ల నిర్మాణం


(వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తేతెలంగాణ) : ఈ నెల 11న వరంగల్‌ రూరల్‌ జిల్లాకు రాష్ట్ర మున్సిపల్‌, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. సంగెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో నిర్మించిన 80 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ‘డబుల్‌' ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నేతృత్వంలో జరిగే ఈ కార్యక్ర మాన్ని వేడుకలా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకం అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇండ్ల ప్రారంభోత్సవం జరుగుతున్నది ఇదే మొదటిది కావటం విశేషం.

533 ‘డబుల్‌' ఇండ్లు..
డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకం నుంచి ప్రభుత్వం పరకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో 533 రెండు పడ క గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టింది. వీటి కోసం రూ. 30.90 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రతిపాదనల ప్రకారం ఆరు గ్రామాల్లో ఈ 533 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం మొదలైంది. పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో రూ.4.08 కోట్లతో 65, నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో రూ.7.56 కోట్లతో 150, చర్లపల్లి గ్రామంలో రూ.4.78 కోట్లతో 76, ఆత్మకూరు మండలంలోని గూడప్పాడ్‌ గ్రామంలో రూ. 5.91 కోట్లతో 94, కటాక్షపురం గ్రామంలో రూ.3.02 కోట్లతో 60, సంగెం మండలంలోని రామచంద్రాపురంలో రూ.5.03 కోట్లతో 80 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఎమ్మెల్యే చల్లా చొరవతో ఆయా గ్రామంలో ఈ ఇండ్ల నిర్మాణ పనులు సువిశాల స్థలంలో చురుగ్గా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తుది దశకు చేరాయి. ప్రారంభానికి ముస్తాబవుతున్నాయి. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంతో పాటు వివిధ శాఖల ఇంజినీర్లు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు, డ్రైనేజీ తదితర వసతులు కల్పిస్తున్నారు. లేఅవుట్‌ పద్ధతిన ఇండ్లు నిర్మించి ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు విశాలంగా నిర్మిస్తున్నారు. గ్రీనరీకి రోడ్లకు ఇరువైపులా ఇప్పటికే మొక్కలు నాటారు. తొలుత రామచంద్రాపురంలో 80 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. పనులను పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు పర్యవేక్షించారు.

ఆరున్నర ఎకరాల్లో 80 ఇండ్లు..
రామచంద్రాపురం గ్రామంలో ఆరున్నర ఎకరాల్లో 80 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరిగింది. రెండు పడక గదులతో ఒక్కో ఇల్లు 535 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. 2017 ఆగస్టులో ఈ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో చేపట్టిన డబుల్‌ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలుమార్లు రామచంద్రాపురం గ్రామాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పీఆర్‌ ఇంజినీర్లతో మాట్లాడుతూ ఇండ్ల పనులను పరుగెత్తించా రు. ప్రధాన రహదారులు 30 అడుగులు, అంతర్గత రహదారులు 25 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ప్రతి ఇం టిలో ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ పూర్తి చేసి ప్రత్యేకంగా సర్వీసు మీట రు ఏర్పాటు చేశారు. ఇంటింటికి సీరియల్‌ నంబర్‌ వేశా రు. నియోజకవర్గంలో ప్రథమంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రామచంద్రాపురంలోని 80 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ను 11న ప్రారంభించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి చొరవ తీసుకుని డ్రా పద్ధతిన ఆదివారం ఈ 80 ఇండ్లను అర్హులకు కేటాయించారు. సంగెం మండల తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులు, పీఆర్‌ ఇంజినీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఈ లాటరీ విధానం నిర్వహణలో పాల్గొన్నారు. లబ్ధిదారు లు సోమ, మంగళవారం తమ ఇండ్లను శుభ్రం చేసుకోనున్నారు. ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి తమకు ఇవ్వడంపై లబ్ధిదారులు సంబుర పడుతున్నారు. సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రాపురం గ్రామానికి అదనంగా మరో 26 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు.

64

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles