ప్రజా సేవే పోలీసుల లక్ష్యం


Mon,December 9, 2019 01:59 AM

గోవిందరావుపేట, డిసెంబర్‌ 08 : రాష్ట్రంలో ప్రజలకు నిరంతరం సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు. మండలంలో పస్రాలోని కొండ్రెడ్డి రాంరెడ్డి ఫంక్షన్‌హాల్‌ లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం, బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమానికి పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ హాజరై మాట్లాడారు. పోలీసులు అంటే ప్రజల్లో భయం లేకుండా నిర్భయంగా ఉండేలా వివిధ కార్యక్రమాలు చేపడుతూ వారికి రోజు రోజుకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. గిరిజనులకు తమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రతి ఆదివారం పోలీసులు శిక్షణ ఇస్తూ వారికి పలు సూచనలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో జిల్లా వ్యాప్తంగా యువకులకు క్రీడలు నిర్వహించి వారు చెడు దారులు పట్టకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. పస్రా సర్కిల్‌ పరిధిలోని పస్రా, తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న గొత్తికోయలకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గొత్తికోయలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, గూడేలకు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


ములుగు పోలీసులు ముందుంటారు : ఏఎస్పీ సాయిచైతన్య
ప్రజలకు సేవలు అందించడంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడు ముందుంటారని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య అన్నారు. గొత్తికోయలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవనోపాధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే గొత్తికోయలకు బ్లాంకెట్లు, చిన్నారులకు స్వెటర్లు అందించామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువయ్యామని, ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తమను సంప్రదించవచ్చునని సూచించారు.

బ్లాంకెట్ల పంపిణీ..
పస్రా-తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఉంటున్న 600 మంది గొత్తికోయలకు ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ బ్లాంకెట్లను అందించారు. అంతేకాకుండా మరో 100మంది చిన్నారులకు స్వెటర్లు పంపిణీ చేశారు.
గిరిజనులకు ఎస్పీ వైద్య సేవలు..
ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ స్వయంగా గొత్తికోయలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వతహాగా డాక్టర్‌ అయిన ఆయన మెగా వైద్య శిబిరంలో గొత్తికోయ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన మందులను అందించారు. ఈ శిబిరంలో బ్లడ్‌ గ్రూప్‌, షుగర్‌ పరీక్ష, దంతాల సమస్యతో బాధపడుతున్న గొత్తికోయలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను వైద్యులు అందించారు. కరీంనగర్‌కు చెందిన సామాజిక వేత్త గణశ్యాంహోజా ఆధ్వర్యంలో వైద్యాధికారులు కృతార్థ, హారిక, సిబ్బంది యూసుఫ్‌, సంతోశ్‌, సుచిత్రతోపాటు మండల వైద్యాధికారి సుకుమార్‌, కుమారస్వామి, ఫార్మసిస్టు వినోద్‌, ఏఎన్‌ఎంలు సరోజన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పస్రా పీఎస్‌ సందర్శన..
పస్రా పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ సందర్శించారు. 20 ఏళ్ల కిత్రం నిర్మించిన భవనాన్ని నూతన హంగులతో మోడల్‌ పోలీస్‌స్టేషన్‌గా మార్చగా ఎస్పీ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పస్రా ఎస్సై మహేందర్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు. స్టేషన్‌లో చేపట్టాల్సిన అభివృద్ది పనులను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు పస్రా స్టేషన్‌లోనే ఉన్నతాధికారుల బస, భోజన సౌకర్యాలు కల్పించడంపై ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు, వెంకటాపురం(నూగూరు), ఏటూరునాగారం సీఐలు కొత్త దేవేందర్‌రెడ్డి, శివప్రసాద్‌, నాగబాబు, పస్రా, ములుగు, వెంకటాపూర్‌ ఎస్సైలు మహేందర్‌కుమార్‌, రాజు, నరహరి ఉన్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles