మేడారం జాతరకు 4వేల బస్సులు


Sat,December 7, 2019 02:32 AM

-12,500 మంది సిబ్బందితో విధుల నిర్వహణ
-హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు
-ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్‌కుమార్
-మేడారంలో ఆర్టీసీ క్యూలైన్ల పనులు ప్రారంభం


తాడ్వాయి, డిసెంబర్ 6: మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరకు 4వేల బస్సులు నడుపనున్నటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ పనులను ఆర్‌ఎం శ్రీధర్‌తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈడితో పాటు డీఎం, డీవీఎంలతో కలిసి అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు చేశారు. వారికి ఈవో రాజేంద్రంతో పాటు పూజారులు డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు. తల్లుల గద్దెలపై పసుపు, కుంకుమ, బెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు వేసి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైజంక్షన్‌లోని బస్టాండ్‌కు చేరుకుని క్యూలైన్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహాజాతరలో ఆర్టీసీ తరపున భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

నాలుగు వేల బస్సులను నడిపిస్తాం
అమ్మవార్ల జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని 51 డిపోల నుంచి 4వేల బస్సులను నడుపనున్నట్లు ఈడీ తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులను నడుపుతామన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. గత జాతరలో 3500 ఆర్టీసీ బస్సుల ద్వారా 17 లక్షల మందిని మేడారానికి చేరవేశామని, ఈసారి 4 వేల బస్సులతో 22 లక్షల మంది భక్తులను మేడారం చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులను పెంచే అవకాశం ఉంటుందని, భక్తులను క్షేమంగా మేడారానికి తీసుకెళ్లి, క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తామని తెలిపారు.

విధుల్లోకి 12,500 మంది సిబ్బంది
గత జాతరలో 11, 500 మంది సిబ్బందితో భక్తులకు సేవలు అందించామని, ఈసారి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు 12,500 మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. టికెట్ల జారీలో భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వీలైనన్ని ఎక్కువ టిమ్ మిషన్లను ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టికెట్లు తీసుకున్న భక్తులు ఎక్కడా ఇబ్బందులు లేకుండా నేరుగా బస్సులోకి ఎక్కేలా చూస్తామని వివరించారు.

జిల్లాల వారీగా టికెట్ కౌంటర్లు
మేడారం జాతరకు వచ్చే భక్తులు తల్లులను దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో అవస్థలు పడకుండా ఏర్పా ట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో భక్తులు వారి ప్రాంతాలకు వెళ్లే బస్సులను సులభంగా గుర్తించే వీలుంటుందని తెలిపారు. ఈ కౌంటర్లలో సెకండ్ల సమయంలో టికెట్ జారీ చేసి నేరుగా బస్సులోకి ఎక్కేలా ఏర్పాట్లు ఉంటాయని, క్యూలైన్లలో వెళ్లి టికెట్ తీసుకుని బస్సులో కూర్చోవచ్చన్నారు.

హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు
మేడారం వచ్చే భక్తులకు ఈసారి ఏసీ బస్సుల సౌకర్యం కల్పించనున్నామని ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఏసీ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని, రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తద్వారా భక్తుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. భక్తుల రద్దీని బట్టి ఎక్కువ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తామని, ముంద జాగ్రత్త చర్యలు చేపడుతామని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగనివ్వబోమని వెల్లడించారు.

జనవరి 1 నుంచి బస్సులు..
మహాజాతరకు నెలరోజుల ముందు నుంచే పలు ప్రాంతాల నుంచి మేడారానికి బస్సులు నడిపిస్తామని ఈడీ తెలిపారు. రద్దీని బట్టి ట్రిప్పులను పెంచుతామని పేర్కొన్నారు. ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకుని సర్వీసులు నడుపుతామన్నారు. పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి మేడారానికి హన్మకొండ నుంచి బస్సులు నడపడంతో పాటు పస్రా నుంచి లోకల్ బస్సుల ట్రిప్పులను పెంచుతామని, తాడ్వాయి నుంచి మేడారం వెళ్లేందుకు లోకల్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.

మేడారంలో పెరుగుతున్న రద్దీ
మేడారం సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ర్టాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో తెల్లవారుజామునే వచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేసి, వాగు ఒడ్డున ఉన్న జంపన్న, నాగులమ్మ గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లుల గద్దెల వద్దకు చేరుకొని, సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు పెట్టి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. యాటపోతులు, కోళ్లు బలిచ్చి, గద్దెల పరిసరాలతో పాటు చిలుకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. సమ్మక్క మహాజాతరకు 60 రోజుల సమయం ఉన్నది. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడనున్న దృష్ట్యా పలువురు భక్తులు ముందుగానే మేడారం వచ్చి తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. గతంలో బుధ, గురు, ఆదివారాల్లో మాత్రమే రద్దీ ఉండేది. ప్రస్తుతం వారంతో సంబంధం లేకుండా రోజూ వేలాది మంది మేడారం వస్తున్నారు. గద్దెల ప్రాంగణం ప్రతి రోజూ భక్తులతో కళకళలాడుతున్నది. భక్తుల తాకిడి పెరుగుతుండడంతో అధికారులు అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నారు.

84

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles