అనుమతి ఉన్న మందులే విక్రయించాలి


Sat,December 7, 2019 02:30 AM

ములుగు, నమస్తే తెలంగాణ : ఔషధ నియంత్రణ శాఖ ద్వారా లైసెన్స్‌లు తీసుకోకుండా అక్రమంగా తయారు చేసిన మందులను విక్రయిస్తే సంబంధిత మెడికల్ షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నల్లమద్ది రవికిరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ రూరల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జే కిరణ్‌కుమార్‌తో కలిసి ములుగు జిల్లా కేంద్రంలోని మయూరి మెడికల్ హాల్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికిరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు వరంగల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. పశువుల ఎదుగుదలకు ఉపయోగించే మెడ్‌బ్రోట్ అనే మందులను హైదరాబాద్‌కు చెందిన మెడ్‌వేట్ ఆగ్రోవెట్ ఇండియా అనే కంపెనీ ఎలాంటి అనుమతులూ లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.


ఆ మందులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీకి చెందిన మందులు మయూరి మెడికల్ హాల్‌లో లభించాయని, ఆ కంపెనీకి చెందిన మందులను సీజ్ చేసినట్లు తెలిపారు. మయూరి మెడికల్ హాల్ యజమానితో పాటు హైదరాబాద్‌కు చెందిన కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సీజ్ చేసిన మందులను కోర్టులో అప్పగించినట్లు వివరించారు. మనుషుల, పశువుల ప్రాణాలను కాపాడే ప్రాణాధారమైన మందులను తయారు చేసే కంపెనీలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొందరు అనుమతి లేకుండా మందులను తయారు చేసి మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని మెడికల్ షాపుల యజమానులు గ్రహించాలని, లైసెన్స్‌లు ఉన్న మందుల తయారీదారుల వద్ద మందులు తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఔషధ నియంత్రణ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles