రైతులకు సమన్వయంతో మద్దతు ధర అందించాలి


Tue,November 12, 2019 02:22 AM

-ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి
-ఇతర రాష్ర్టాల వారికి అవకాశం ఇవ్వొద్దు
-ధ్రువీకరించిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి
-దిగుబడి అంచనాలను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించాలి
-ధాన్యం కొనుగోలు కేంద్రాలను ర్యాండమ్‌గా తనిఖీ చేయాలి
-ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలి
- రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలి
-దశల వారీగా జిన్నింగ్ మిల్లులకు నిధులు విడుదల చేస్తాం
-వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి


ములుగుజిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్: రాష్ట్రంలోని రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు రెవెన్యూ పౌర సరఫరాలు, మార్కెటింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంత్రులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ర్టాల రైతులు దీనిని అవకాశంగా తీసుకోకుండా చూడాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులను ధ్రువీకరించిన అనంతరం ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. మండలాలు, గ్రామాల వారీగా రైతులు సాగు చేసిన వరి విస్తీర్ణం, దిగుబడి అంచనాల నివేదికను వ్యవసాయ శాఖ రూపొందించినట్లు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ర్యాండమ్‌గా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిన్నింగ్ మిల్లుల ప్రొత్సాహకాల బకాయిల విడుదల అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. దశల వారీగా జిన్నింగ్ మిల్లులకు నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. అలాగే, గన్నీ బ్యాగుల కొరత రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, వర్షం వస్తే వరి ధాన్యం తడవకుండా టార్ఫాలిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పడికప్పుడు మిల్లులకు పంపి రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ధాన్యానికి సంబంధించి ప్రభుత్వ సూచనల మేరకు అనుగుణంగా మిల్లర్లతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం జయశంకర్ భూపాలపల్లి జేసీ కూరాకుల స్వర్ణలత మాట్లాడుతూ జిల్లాలో 107 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు పగడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు జిల్లా నుంచి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ములుగు నుంచి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్‌వో గౌరీశంకర్, డీఏవో సత్యంబాబు, సివిల్ సప్లయ్ డీఎం రాఘవేందర్, డీసీవో రామ్మోహన్ రావు, ఏఎస్‌వో వాజిద్, సీఐలు వేణు, దేవేందర్ రావు, సివిల్ సప్లయ్ డీటీ వినయ్‌సాగర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

74

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles