పాలక మండలి సమావేశానికి సిద్ధం కావాలి


Tue,November 12, 2019 02:20 AM

-ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు
ఏటూరునాగారం, నవంబర్11: త్వరలో నిర్వహించే పాలక మండలి సమావేశానికి సంబంధించి అన్నిశాఖల అధికారులు తమ నివేదికను అందజేయాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల మొదటి వారంలో పాలక మండలి సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నందున అధికారులు తమ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు నివేదిక ప్రగతి వారీగా అందజేయాలని చెప్పారు. మండలంలోని శివ్వాపూర్‌లో ఏర్పాటు చేసే డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని జీసీసీ డీఎం రామానందానికి తెలిపారు. రెండు రోజుల్లో మిషనరీ రానున్నట్లుగా రామానందం వివరించారు. తయారీ కేంద్రం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో ఏఈఈ వాలు నాయక్‌ను ఆదేశించారు. అదే విధంగా మేడారం జాతరలో విద్యుత్ శాఖ ఏర్పాట్లు ఎప్పుడు ప్రారంభిస్తారని పీవో వాలు నాయక్‌ను ప్రశ్నించగా టెండర్లు ఓపెన్ కాగానే పనులు ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని వాలు నాయక్ తెలిపారు. గ్రామాల్లో వైద్యం అందుతున్న తీరుపై డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వైద్యశిబిరాలు నడుస్తున్నాయని, జ్వరాలు తగ్గినప్పటికీ చలికాలం కావడంతో జలుబు లాంటివి కన్పిస్తున్నాయని, పీహెచ్‌సీవోలో అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు రవీందర్ వివరించారు.


గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పునాది అమలుపై ఏసీఎంవో సారయ్యను ప్రశ్నించారు. ప్రస్తుతం బేస్‌లైన్ టెస్టు పెట్టడం జరిగిందని, వాటికి సంబంధించి ఫలితాలు రావల్సి ఉందన్నారు. త్వరగా మీటింగ్ హాలు పునరుద్ధరణ పనులు చేపట్టాలని డీఈఈ మధుకర్‌కు సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరివికాస్ పథకం కింద వ్యవసాయ బోర్లు, మోటార్లు అందించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఏపీడీ వెంకటనారాయణకు పీవో చక్రధర్‌రావు ఆదేశించారు. రూరల్ ట్రాన్స్‌పోర్ట్ స్కీంను వెంటనే గ్రౌండింగ్‌చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీవో వసంతరావుకు పీవో సూచించారు. ఏజెన్సీలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న గిరి పోషణ, అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ, పోస్టుల భర్తీపై సీడీపీవో హేమలతను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలోని కొత్తగూడ, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల వివరాలను అందజేస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి భర్తీ చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు పీవో వెల్లడించారు. గిరిపోషణ అమలు తీరును తెలుసుకున్నారు. ఇంకా మూడు నెలల వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుందని ఆమె వివరించారు. రైతు బంధు పథకం అమలుపై ఏడీఏ శ్రీధర్‌తో చర్చించారు. గ్రామాల్లో పెసా కమిటీలు వేస్తున్నామని, ఇంకా కొన్ని వేయాల్సి ఉందని పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ వివరించారు. సమీక్షలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles