మహనీయుడు.. కొండా లక్ష్మణ్


Mon,November 11, 2019 01:17 AM

-తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యజించిన త్యాగధనుడు
-ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి
-రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-తొర్రూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ


తొర్రూరు, నమస్తేతెలంగాణ: నేటితరం యువత ఆదర్శ భావాలు కలిగిన దివంగత మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో విశ్రాంతి భవనం సమీపంలో వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారి పక్కన తొర్రూరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ భారీ విగ్రహాన్ని ఆదివారం రాత్రి మంత్రి దయాకర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ కన్వీనర్ గడ్డం ఈశ్వర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లక్ష్మణ్ బాపూజీ సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగాడని అన్నారు. విద్యార్థి దశలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాడని, 1969లో రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలోనూ భాగస్వామి అయ్యాడని చెప్పారు.

నాటి నుంచి తెలంగాణ ప్రజల విముక్తి, రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ తన రాజీనామా లేఖను నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖాన విసిరేసి పోరాటంలో పాల్గొన్నాడని అన్నారు. నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న తెలంగాణ ఉద్యమంలో నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బాపూజీని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి బాపూజీ స్వగృహంలో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి ప్రజాస్వామ్యయుతంగా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈ ఇద్దరు మహానుభావులను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. పద్మశాలీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి ఉపాధి కల్పించడం కోసం బతుకమ్మ చీరెల బాధ్యత పద్మశాలీలకు అప్పగించడం జరుగుతుందన్నారు. పవర్‌లూమ్‌ల నిర్వహణకు విద్యుత్ సబ్సిడీ, అర్హులైన వారికి ఫించన్లు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

బాపూజీతో సన్నిహిత సంబంధం ..
గతంలో టీడీపీలో కొనసాగిన సమయంలో ఓ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ తనకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారన్నారు. మీరు ఏ పార్టీలో కొనసాగినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందు నిలువాలని సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఆ మహానుభావుడి సలహా మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజకీయంగా ఒత్తిడి పెంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించడం జరిగిందన్నారు. ఆయన పద్మశాలి కులంలో పుట్టినప్పటికీ వారికే పరిమితం కాదని యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఆదర్శనీయుడని కొనియాడారు.

చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం..
కొండా లక్ష్మణ్ బాపూజీ తన చివరి శ్వాస వరకు తపించాడని, మంత్రి పదవికి రాజీనామా చేసి ఎటువంటి పదవులను స్వీకరించకుండా తెలంగాణ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారని రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్ పర్సన్ గుండు సుధారాణి అన్నారు. ఉమ్మడి జిల్లాలో టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు ద్వారా ప్రజలకు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నారు. పద్మశాలీలు తిరిగి సొంత గ్రామాలకు చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

విగ్రహ ఏర్పాటు అభినందనీయం
తొర్రూరు డివిజన్ కేంద్రంలో మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఆయన విగ్రహ ఏర్పాటు ద్వారా నేటి తరం విద్యార్థులు, యువతకు ఆయన గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుందన్నారు. బాపూజీ ఒక న్యాయవాదిగా ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి ఫీజు తీసుకోకుండా పేదల పక్షాన నిలిచారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామిజీ, తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ కోట చలం, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె రవి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, తహసీల్దార్ రమేశ్‌బాబు, దళితరత్న గుండాల నర్సయ్య, సంఘం నాయకులు పెండెం రమేశ్, బుధారపు శ్రీనివాస్, చిట్యాల విద్యాసాగర్, కూరపాటి సోమయ్య, సాదుల రాజశేఖర్, వేముల సోమదాసు, రాపోలు ప్రభాకర్, చిట్యాల శంకర్, వెంకన్న, కస్తూరి పులేందర్, తుమ్మ వెంకటేశ్వర్లు, కందగట్ల సోమశేఖర్, మనోహర్ తదితరులు
పాల్గొన్నారు.

35

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles