బుగులోని జాతరకు వేళాయె..


Sun,November 10, 2019 02:17 AM

-భక్తుల కొంగు బంగారం వేంకటేశ్వరస్వామి
-రెండో తిరుపతిగా ప్రసిద్ధి
-11 నుంచి జాతర ప్రారంభం
-ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న ప్రభబండ్లు
-తరలిరానున్న వేలాది మంది భక్తులు


రేగొండ మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలోని తిరుమలగిరి శివారు పాండవుల గుట్టలపై ఏటా కార్తీక పౌర్ణమి నుంచి బుగులు వేంకటేశ్వరస్వామి జాతర సాగుతుంది. ఇక్కడ కొలువుదీరిన వెంకన్న భక్తులకు కొంగుబంగారం నిలుస్తున్నాడు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సాగే జాతరలో ప్రభ బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చుట్ట పక్కల గ్రామాల నుంచి మేక, ఏనుగు, గుర్ర ప్రభలను తీసుకొచ్చి గుట్ట కింద ఉన్న ఇప్ప చెట్టు చుట్టు తిప్పుతారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ జాతర మూడు రోజుల పాటు భక్తులతో కిటకిటలాడనుంది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా చుట్టు పక్కల జిల్లాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

జాతర ప్రాశస్త్యం..
వేంకటేశ్వరస్వామి అలివేలుమంగ, పద్మావతితో ఆకాశ మార్గాన విహరిస్తుండగా పద్మావతి భూలోకంలో ఆలసట తీర్చుకుందామనగానే తిరుమల తిరుపతి కొండలపై విశ్రాంతి తీసుకున్నారు. దీంతో అది మొదటి తిరుపతిగా పేరుగాంచింది. అక్కడి నుంచి స్వామి వారు సతీసమేతంగా బయలు దేరగా.. రెండోసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులోని గుట్టలపై అలసట తీర్చుకున్నారు. స్వామివారు నడయాడిన ప్రాంతాన్ని రెండవ తిరుపతిగా పిలుస్తారని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. వెంకన్న స్వామి ఆలువేలుమంగ, పద్మావతితో విశ్రాంతి తీసుకుంటుండగా మహిళలు పాటలు పాడుతూ వడ్లు దంచుతున్న శబ్ధానికి తనకు నిద్ర పట్టడడం లేదని స్వామికి చెప్పగానే వెంకటేశ్వరస్వామి బుగులు (భయంతో) ఆ పక్కనే ఉన్న గుట్టలపైకి అమ్మవార్లతో కలిసి వెళ్లాడటా. దీంతో నాటి నుంచి బుగులోని వెంకటేశ్వరస్వామిగా భక్తులు పిలుస్తున్నట్లుగా ప్రతీతి. ఆ స్వామి వారు గుట్టపై ఉన్నట్లుగా తెలుపడానికి గొల్లవారు ఉన్న గ్రామాల్లో చల్ల అమ్ముతుండగా చల్ల ముంతలు, గొర్రెలు, పశువులను ఉన్న చోటనే మాయం చేయడంతో ఏమి చేయాలో తోచని ప్రజలు ఆ గుట్టలో వెలసిన స్వామిని కొలవగానే మళ్లీ యథా స్థానంలో ప్రత్యక్షమైనట్లుగా ప్రజలు చెబుతారు. అందుకే అప్పటి నుంచి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున జాతర వైభవంగా జరుపుతుంటామని గ్రామస్తులు తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్నవారు స్వామి దర్శనానికి వెళ్తే తేనేటీగలు వెంటబడుతాయని భక్తులు చెబుతుంటారు.

నిష్టతో జాతర ఉత్సవాలు
బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాలను తిరుమలగిరి గ్రామస్తులు నిష్టతో నిర్వహిస్తారు. 11న (సోమవారం) స్వామి వారు గుట్టపైకి వెళ్లడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12న కార్తీక పౌర్ణమిన స్వామి వారికి దీపోత్సవం, ఏనుగు, మేక, గుర్రం ప్రభ బండ్లు ఇప్ప చెట్టు చుట్టూ తిప్ప డం, 13న స్వామి వారికి అభిషేకం, వాహనాలు తిరగడం, మొక్కులు చెల్లించడం, 14న(గురువారం) జాతర ముగుస్తుంది.

81

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles