ఉచిత శిక్షణ భవిష్యత్తుకు నిచ్చెన


Sun,November 10, 2019 02:15 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు వివిధ వృత్తి విద్య కోర్సుల్లో ఇస్తున్న ఉచిత శిక్షణ వారి భవిష్యత్తుకు నిచ్చెనగా నిలుస్తుందని భూపాలపల్లి ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు ఈసీహెచ్ రాజకుమారి నిరీక్షణ్‌రాజ్ అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియా యైటిైంక్లెన్ కాలనీలో ఏర్పాటు చేసిన టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వృత్తి విద్య అభ్యాసకులనుద్దేశించి ఆమె మాట్లాడారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత వృత్తి విద్య కోర్సుల్లో క్రమశిక్షణతో శిక్షణ పొంది తద్వారా ప్రయోజకులు కావాలన్నారు. కుట్టు శిక్షణ ప్రస్తుతం జీవన శైలిలో ఒక భాగంగా అనుకొని నేర్చుకోవాలని, టైలరింగ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. అదేవిధంగా సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారనారు. ఈ వృత్తి విద్య కోర్సులను శ్రద్ధగా నేర్చుకొని కుటుంబ ఆర్థిక భాగస్వామ్యంలో పురుషులతో పాటు తమవంతు చేయూతను అందించాలన్నారు.


సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్య సాధనను ప్రతి ఉద్యోగి తమ కర్తవ్యం నిర్వర్తించే విధంగా గృహిణులుగా ఉన్న సింగరేణి మహిళలు తమవంతు తోడ్పాటును అందించాలన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం సంస్థ చేపట్టి అమలు చేస్తుందన్నారు. ప్రధానంగా ప్రతి సింగరేణీయుడు గైర్హాజరు కాకుండా సక్రమంగా విధులు నిర్వహించే విధంగా మహిళలు తమవంతు ప్రోత్సాహం, శ్రద్ధ కనబర్చాలన్నారు. అప్పుడే సంస్థ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడానికి సాధ్యమవుతుందన్నారు. ఈకార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) మంచాల శ్రీనివాస్, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ రాజేశం, సేవా సెక్రటరీ పుష్పలత, సభ్యులు సరళ, అరుణ, ఫాతిమా, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ ఉత్తమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles