చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి


Sat,November 9, 2019 05:59 AM

బచ్చన్నపేట, నవంబర్ 08 : ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఇందుకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను వేదిక చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ కే కృష్ణవేణి ఆధ్వర్యంలో జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాలోని ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడల్లో ఇరవై మండలాల నుంచి 20 బాలికల జట్లు, 20 బాలుర జట్లు పాల్గొన్నాయి. క్రీడలను డీఈవో యాదయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, ప్రిన్సిపాల్ కృష్ణవేణి కలిసి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని, అందులో రాణిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగే అవకాశముందన్నారు.


ఆదర్శ పాఠశాల, కళాశాలల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడుతాయన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపితే భవిష్యత్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఎంపీపీ నాగజ్యోతి మాట్లాడుతూ క్రీడలు శరీర ధారుడ్యానికి తోడ్పాటు అందించడంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందన్నారు. బచ్చన్నపేట ఆదర్శ పాఠశాలకు పీడీ పోస్టును వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పీడీలు నరేందర్‌గౌడ్, నీలం కుమారస్వామి, వెంకటేశ్వర్లు, వీర్యానాయక్, సురేందర్, ఎస్‌ఎంసీ చైర్మన్లు జంజిరాల కిషన్, పెంటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

విజేతలు వీరే..
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన అంతర్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలను ప్రిన్సిపాల్ కృష్ణవేణి ప్రకటించారు. బాలుర విభాగంలో జయశంకర్‌భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ జట్టు ప్రథమస్థానంలో, కొడకండ్ల ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా బాలికల విభాగంలో జనగామ జిల్లా జఫర్‌ఘడ్ ప్రథమ స్థానంలో నిలవగా రఘునాథపల్లి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు మెమోంటోలతో పాటు ప్రశంసా పత్రాలను రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. కార్యక్రమంలో బచ్చన్నపేట, ఆలీంపూర్ సర్పంచ్‌లు వడ్డేపల్లి మల్లారెడ్డి, నరెడ్ల బాల్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు షబ్బీర్, కవిత, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles