రూర్బన్ మిషన్ పనులు పూర్తి చేయాలి


Fri,November 8, 2019 04:10 AM

-నాగారంలో శీతలీకరణ, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు..
-అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
-అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలి: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్, నవంబర్ 7: రూర్బన్ మిషన్ ద్వారా నాగారం క్లస్టర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రూర్బన్ మిషన్ పనుల ప్రగతిపై కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతులు కల్పించేందుకు రూర్బన్ మిషన్ కార్యక్రమం గొప్ప అవకాశమన్నారు. భూపాలపల్లి మండలం నాగారం క్లస్టర్ ఈ కార్యక్రమానికి ఎంపికైందని, ఇక్కడ పట్టణ స్థాయి వసతులు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. రూర్బన్ మిషన్ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేయాలని, దీనికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామాల మధ్య రహదారుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ పనులు ప్రారంభించడానికి స్థలం గుర్తించి, నిధులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రెండు కమ్యూనిటీ హాళ్లు, గ్రామ పంచాయతీల్లో సిటిజన్ సర్వీసింగ్ కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. శీతలీకరణ కేంద్రం, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

పార్క్‌లో పనులను పూర్తి చేయాలి
భూపాలపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్‌లో చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకు రావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరనీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన పవర్ సేవింగ్ రిమోట్ కంట్రోల్ ప్యాన్, ట్యూబ్ లైట్లు ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ కే స్వర్ణలత, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్, ఎంపీపీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles