పట్టుదలకు పోవద్దు


Thu,November 7, 2019 02:19 AM

-యూనియన్ల మాటలు నమ్మి ఆర్టీసీ కార్మికులు మోసపోవద్దు
-రెచ్చగొడుతున్న కాంగ్రెస్, బీజేపీలు
-మున్సిపల్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
-ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
-షెల్టర్ ఫర్ హోంలెస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన


భూపాలపల్లి టౌన్, నవంబర్ 6: షెల్టర్ ఫర్ హోంలెస్ భవనం ప్రజలకు వరమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సుభాశ్‌కాలనీ సమీపంలో (ఆర్‌టీసీ బస్ డిపో వెనుక)మెప్మా ఆధ్వర్యంలో రూ.1.39 కోట్లతో షెల్టర్ ఫర్ హోం లెస్ భవనానికి ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి భూపాలపల్లికి వచ్చిన ప్రజలు ఈ భవనంలో రాత్రి వేళల్లో నిద్రించి మరుసటి రోజు వెళ్లడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. భవన నిర్వహణ బాధ్యతలను ఏదేని స్వచ్ఛంద సంస్థకు అప్పగించి భోజన సౌకర్యాన్ని కల్పించేలా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ భవనం బస్టాండ్‌కు సమీపంలో ఉన్నదని తెలిపారు. రాత్రి వేళ బస్సులు లేక గమ్యస్థానం చేరడానికి వీలు దొరకని వారు ఇందులో ఉండవచ్చని వివరించారు. భూపాలపల్లి పట్టణాభివృద్ధికి ఇప్పటికే రూ.50 కోట్ల వరకు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. ఇటీవల రూ.6 కోట్లు మంజూరు చేయించానని, ఈ నిధులతో మున్సిపాలిటీకి వాహనాలు, సామగ్రి కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు పట్టుదలకు పోకుండా విధులకు హాజరై తమ సమస్యలను సామరస్యధోరణితో పరిష్కరించుకోవాలని కోరారు. యూనియన్ల మాటలు నమ్మి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు. విలీనం డిమాండ్‌ను పక్కన పెట్టాలని, కాంగ్రెస్, బీజేపీలు కార్మికులను రెచ్చగొడుతున్నాయని, అవి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా..? అని ప్రశ్నించారు. వారు కావాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే కాకపోతే భూపాలపల్లిలో భూకబ్జాలు పెరిగిపోయేవని, ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా, కబ్జాలు జరిగినా ఊరుకునేది లేదన్నారు. కొందరు తమ ఉనికి కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని, శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు.

స్థల పరిశీలన
ఆర్టీసీ డిపో వెనుక షెల్టర్ ఫర్ హోంలెస్ భవనానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం పరిశీలించారు. స్థలంలో నిర్మించబోయే భవన ఫ్లాన్‌ను చూశారు. సమీపంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో తెలుసుకున్నారు. భూమి ఆక్రమణకు గురైందా అని కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. స్థలాలను ఆక్రమిస్తే కఠినంగా వ్యవహరించాలని కోరారు. షెల్టర్ ఫర్ హోం లెస్ భవనాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను కోరారు.

రిటైర్డ్ కార్మికుల మొర
పట్టణంలోని సుభాశ్‌కాలనీకి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వద్ద సింగరేణి రిటైర్డ్ కార్మికులు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకం ద్వారా తాము కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందామని, తమకు రూ. 1000 పింఛన్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ. 1000 వరకు పింఛన్ వస్తున్నదని, తమకు కనీసం ఆసరా పింఛన్ రావడం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య బాధితులు దుర్గం రాజయ్య తదితరులు ఎమ్మెల్యేను కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. మెప్మా డీఈ మల్లారెడ్డి, మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీనివాసరెడ్డి, డీఎంసీ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మెప్మా అధ్యక్షురాలు చాతరాశి స్వప్న, కార్యదర్శి వాసాల స్వప్న, కో-ఆర్డినేటర్ నిర్మల, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ, వార్డు మాజీ కౌన్సిలర్ బేతోజు వజ్రమణి, టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నేతలు బుర్ర రమేశ్, బండారి రవి, చల్లూరి సమ్మయ్య, కొత్త హరిబాబు, మందల విద్యాసాగర్‌రెడ్డి, డాక్టర్ నర్సింహాచారి, బ్రహ్మారెడ్డి, మురళి, పూలమ్మ, తిరుపతమ్మ, భాగ్యలక్ష్మి, మాజీ వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles