బావ లైంగిక వేధింపులు భరించలేక మరదలు ఆత్మహత్య


Sun,November 3, 2019 02:18 AM

ఏటూరునాగారం, నవంబర్ 02 : బావ లైంగిక వేధింపులు భరించలేక మరదలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని రొయ్యూరులో జరిగింది. ఈ మేరకు మృతురాలి అన్న కావిరి అర్జున్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొయ్యూరు గ్రామానికి చెందిన తాటిపల్లి శ్రీదేవి(29) భర్త వెంకటయ్య నాలుగు సంవత్సరాల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. కాగా, అప్పటినుంచి శ్రీదేవి బావ (శ్రీదేవి భర్త వెంకటయ్య అన్న తాటిపల్లి రామయ్య) లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. శ్రీదేవితో రామయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విషయాన్ని శ్రీదేవి ఆమె అన్న అర్జున్‌కు చెప్పారు. పద్ధతి మార్చుకోవాలని రామయ్యను అర్జున్ పలుమార్లు మందలించాడు.


అయినప్పటికీ రామయ్య వైఖరిలో మార్పు రాలేదు. ఈక్రమంలో శుక్రవారం శ్రీదేవి పొలం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా రామయ్య అడ్డుపడి వేధించాడు. రామయ్య భార్య, మాజీ సర్పంచ్ పోషమ్మ కూడా భర్తకే వంతపాడుతూ నా భర్తతో ఉంటే నీ ఆస్తి కూడా మాకే చెందుతుందంటూ శ్రీదేవితో దుర్భాషలాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీదేవి రామయ్య ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే శ్రీదేవిని మండల కేంద్రంలోని దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. వరంగల్‌కు తీసుకెళ్తున్న క్రమంలో శ్రీదేవి మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కాగా, అర్జున్ ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

69

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles