ప్రశాంతంగా ప్రయాణం


Sat,November 2, 2019 02:07 AM

-28వ రోజు కొనసాగిన 57 బస్సులు
-కనిపించని సమ్మె ప్రభావం


భూపాలపల్లి టౌన్, నవంబర్ 1 : ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వారికి అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఆర్టీసీలో సమ్మె శుక్రవారం నాటికి 28వ రోజుకు చేరింది. భూపాలపల్లి డిపో నుంచి 57 బస్సు లు రోడ్డెక్కాయి. ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీలతో సహా అన్ని రూట్లకూ సర్వీసులను నడిపించారు. సమ్మె సందర్భంగా సబ్ డివిజన్ పోలీసులు భూపాలపల్లి ఆర్టీసీ డిపో, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి డిపో వద్ద తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ పోస్టుల కోసం నిరుద్యోగులు క్యూ కట్టారు. అధికారులు అదనంగా డ్రైవర్ , కండక్టర్‌లను తాత్కాలిక పద్ధతిన ఇప్పటికే నియమించుకున్నారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి ఇప్పటి వరకు హన్మకొండ, కాళేశ్వరం, మంచిర్యాలకు మాత్రమే బస్సులు నడిపించే వారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు దూర ప్రాంతాలకు బస్సులను తిప్పుతున్నారు. బస్సుల్లో టిమ్ మిషన్ల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు.

రోడ్డెక్కిన అన్ని సర్వీసులు
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో మొత్తం 80 బస్సులు ఉండ గా అధికారులు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి బస్సుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు 40 నుంచి 55 బస్సుల వరకు భూపాలపల్లి డిపో నుంచి తిప్పుతున్నారు. శుక్రవారం భూపాలపల్లి డిపో నుంచి 57 బస్సులు రోడ్డెక్కాయి. ఇందులో 50 ఆర్టీసీ బస్సులుండగా 7 అద్దె బస్సులు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, సూపర్ డిలక్స్, సూపర్‌లగ్జరీ, పల్లె వెలుగు ఇలా అన్ని సర్వీసులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి.

పూర్తిస్థాయిలో టిమ్‌లు
భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుల్లో టిమ్ మిష న్లతో టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియను అధికారులు ప్రారంభించి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు. క్రమక్రమంగా టిమ్ మిషన్ల సంఖ్యను పెంచుతూ ఆదాయాన్ని పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. డీటీవో వేణు ఆధ్వర్యం లో బస్సుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేయకుండా కాల్ సెంటర్ నెంబర్లు ప్రకటించారు. భూపాలపల్లి డిపోలో కండక్టర్లు తెచ్చే డబ్బులను తీసుకోవడం, వారికి రోజువారీ వేతనాలను అందించడానికి తహసీల్దార్, కలెక్టరేట్ నుంచి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం అన్ని సర్వీసుల్లో అధికారులు టిమ్‌లను ప్రవేశపెట్టి బస్సులు నడుపుతున్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles