మన పత్తే టాప్..


Fri,November 1, 2019 02:35 AM

-ఓరుగల్లు పత్తికి దేశవ్యాప్త గుర్తింపు
-సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
-గిట్టుబాటు ధర ప్రభుత్వ లక్ష్యం
-తేమశాతం అధికంగా ఉన్నా కొనుగోలు చేయాలి
-కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
-ప్రతి రైతు పత్తి కొనుగోలు చేసేలా చర్యలు
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-ఏనుమాముల మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం
-హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్


కాశీబుగ్గ, అక్టోబర్31: ఓరుగల్లు తెల్లబంగారానికి దేశవ్యాప్త గుర్తింపుతో పాటు మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భారత ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌కు వచ్చిన పత్తిని,మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల కంటే కేసీఆర్ సర్కార్ రైతుల పక్షపాతిగా పని చేస్తుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వర్షాలు అధికంగా ఉండడంతో తేమ శాతం ఎక్కువ ఉంటుందని, తేమ శాతం అధికంగా ఉన్న కొనుగోలు చేయడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. తేమ ఉన్న పత్తిని కుడా కొనుగోలు చేసేలా చూస్తామని భరోసా ఇచ్చారు. జిన్నింగ్ మిల్లు వ్యాపారస్తులు సైతం దిగుబడిలో తేమ ఉన్నా.. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయాలని కోరారు. గతేడాది కంటే రాష్ట్రంలో ఈసారి 5.40 కోట్ల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా ఉన్నట్లు చెప్పారు. దేశంలోనే నాణ్యమైన పత్తిని వరంగల్ రైతులు పండిస్తారని, ఈ మేరకు దేశవ్యాప్త గుర్తింపు సాధించారన్నారు. ప్రతి రైతు పత్తిని కొనుగోలు చేసేలా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

రెండో గ్రేడ్ పత్తిని కుడా కొనుగోలు చేసేలా చేస్తామన్నారు. రైతులు లూజు పత్తిని తీసుకురావాలని కోరారు. రైతులకు మెరుగైన సేవలందించడానికి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. సీసీఐ వారికి అవసరమైతే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంఘాల నాయకులు రైతులను చైతన్యం చేసి గిట్టుబాటు ధరలు వచ్చేలా చేయాలని చెప్పారు. అనంతరం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, చాంబర్ ప్రతినిధులు, రైతు సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంటల కొనుగోలు, రైతులకు అందాల్సిన ధరలపై ఆయన పలు సూచనలు చేశారు. మంత్రి వెంట స్టాండింగ్ కమిటీ సభ్యులు బయ్యాస్వామి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన, తెలంగాణ రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జేసీ దయానంద్, ఆర్డీవో వెంకారెడ్డి, డీడీఎం అజ్మీరా రాజునాయక్, కార్యదర్శి క్యారం సంగయ్య, తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ అధ్యక్షకార్యదర్శులు దిడ్డి కుమారస్వామి, తోట నర్సింహరావు, సాదుల దామోదర్, శ్రీరాం రవి, కంచె సారయ్య, నల్ల సాంబయ్య, తుమిక సురేశ్‌బాబు, నాయకులు ముడుసు నరసింహ, గంధం గోవిందు, కేతిరి రాజశేఖర్ ఉన్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles