ఉద్యోగుల సంక్షేమమే సింగరేణి ధ్యేయం


Tue,October 15, 2019 03:22 AM

-కాలుష్య రహిత కమ్యూనిటీలను నిర్మిస్తాం
-పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు
-భూపాలపల్లి ఏరియాలో కొత్త మైన్ల ఏర్పాటుకు యోచన
-అడ్వాన్స్ స్టేజీలో ఒడిశాలోని కోల్‌బ్లాక్
-2020లో బొగ్గు ఉత్పత్తికి అవకాశం


భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సింగరేణి సంస్థ పని చేస్తుందని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పీ అండ్ పీ) భాస్కర్‌రావు అన్నారు. సోమవారం భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, బొగ్గు ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఉత్పత్తికి సహకరించే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తామన్నారు. భూపాలపల్లిలో ఇదివరకే అనేక మైన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నామని, రానున్న రోజుల్లో కొత్త మైన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేటీకే ఓసీపీ-3ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ పరిధిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందని, ఆ ఏరియాలో కోల్‌మైన్ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను ప్రభుత్వం నుంచి త్వరలోనే తీసుకోవడానికి దరఖాస్తు చేస్తామన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నైనీ, మరో ఇతర కోల్‌బ్లాక్‌లు మంజూరయ్యాయని, నైనీ అడ్వాన్స్ స్టేజీలో ఉందని, ఈ నెల 22న ఈసీ మీటింగ్ అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. అన్ని అనుకూలిస్తే 2020లో దానిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, కేవలం ఒడిశాలోని కోల్‌బ్లాక్ ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గు 15 నుంచి 20 మిలియన్ టన్నులు ఉంటుందని తెలిపారు.

ఇదివరకు కోల్‌మైన్స్‌ను లీజ్ ద్వారా పొందేందుకు అవకాశం ఉండేదని, కానీ 2015 చట్టం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కోల్ నిర్ణయించిన ధరకు మైన్స్‌ను దక్కించుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు లభించే మైన్లను సొంతం చేసుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోల్‌మైన్స్‌లో ఉద్యోగావకాశాలు కూడా ఎప్పటికప్పుడు కల్పిస్తూ కార్మికుల సంక్షేమానికి బాటలు వేస్తున్నామని తెలిపారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, ప్లాంటేషన్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్, ఎస్‌వో టు జీఎం జీ రఘుపతి, డీజీఎం (సివిల్) సత్యనారాయణ, డీజీఎం (ఫైనాన్స్) రామకృష్ణ, గ్రూప్ ఆఫ్ మైన్స్ ఏజెంట్స్ టీవీ రావు, వెంకట్రామ్‌రెడ్డి, ఆయా డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొన్నారు.

62

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles