రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో శ్రీకాంత్‌కు గోల్డ్‌ మెడల్‌


Sun,October 13, 2019 01:37 AM

- సత్తా చాటిన మారుమూల ప్రాంత విద్యార్థి
- గతంలోనూ పలు పతకాలు


మహాముత్తారం, అక్టోబర్‌ 12 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం స్తంభంపల్లి పీపీ గ్రామానికి చెందిన పసుల శ్రీ కాంత్‌ లాంగ్‌ జంప్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 6వ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి పాల్గొని, అండర్‌-18 విభాగంలో లాంగ్‌ జంప్‌లో 5.98 మీటర్లు దూకి మొదటి స్థానంలో సాధించాడు. పసుల రాజయ్య-లక్మి దంపతుల ద్వితీయ కుమారుడు పసుల శ్రీకాంత్‌ చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపుతున్నాడు. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ లాంగ్‌ జంప్‌, హైజంప్‌, 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌ మెడల్‌ సాధించి జిల్లాకు పేరు తెచ్చాడు. శ్రీకాంత్‌ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. 5వ తరగతి వరకు స్తంభంపల్లి పీపీ ప్రాథమిక పాఠశాలలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మంథని పట్టణంలోని టీఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ పాఠశాలలో, ప్రస్తుతం ఇంటర్‌ మీడియట్‌ టీఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ హుస్నాబాద్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా, శ్రీకాంత్‌ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ లాంగ్‌జంప్‌లో శనివారం గోల్డ్‌మెడల్‌ సాధించడంపై జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొక్కూరి చిన రాజయ్య, ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య, టీమ్‌ మేనేజర్స్‌ దేవ్‌సింగ్‌, రవి కుమార్‌లు శ్రీకాంత్‌ను అభినందించారు.

శ్రీకాంత్‌ సాధించిన పతకాలు..
- 2016లో మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్‌-14 విభాగంలో లాంగ్‌ జంప్‌లో తృతీయ బహుమతి సాధించాడు. స్పోర్ట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా కాంస్య పతకం అందుకున్నాడు.
- 2017లో వరంగల్‌ అంతర్‌ జిల్లాల స్థాయిలో స్పీడ్‌ ఇండియా స్టార్‌మీట్‌ అండర్‌-14 విభాగంలో 100మీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. జాతీయ క్రీడలకు ఎంపికయ్యాడు.
- 2018లో ఖమ్మం జిల్లాలో జరిగిన 64వ రాష్ట్ర క్రీడల్లో పాల్గొని హైజంప్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. పార్వతిరెడ్డి, స్పోర్ట్స్‌ కోచ్‌ ఎండీ గౌస్‌ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.
- 2019 ఆగస్టులో 17న గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో అండర్‌-18 విభాగం లాంగ్‌జంప్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు.
- ప్రస్తుతం 2019 అక్టోబర్‌ 12న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన 6వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌లో అండర్‌-18 విభాగంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా లాంగ్‌ జంప్‌ 5.98 మీటర్లు దూకి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

36

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles