రైట్ రైట్!


Sat,October 12, 2019 03:42 AM

-జిల్లాలో సాఫీగా నడుస్తున్న బస్సులు
-ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాహనాలు నడిపిస్తున్న అధికారులు
-ఏడో రోజు రోడ్లపైకి 30 ఆర్టీసీ, 17 అద్దె ,3 పాఠశాలల బస్సులు
-జోరుగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు
-కనిపించని సమ్మె ప్రభావం
-తాత్కాలిక మహిళా కండక్టర్లు, మెయింటనెన్స్ సిబ్బంది నియామకం
-డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు
-15 వేల మంది గమ్యస్థానాలకు


భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి ఏడో రోజుకు చేరింది. సమ్మె ప్రభావం ప్రజా రవాణా వ్యవస్థపై కనిపించడం లేదు. ఇటు ఆర్టీసీ బస్సులు, అటు ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. భూపాలపల్లిలో శుక్రవారం ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ డిపో నుంచి 30 ఆర్టీసీ, ఆర్టీసీలో కొనసాగే అద్దె వాహనాలు 17, 3 పాఠశాలల వాహనాలు నడిపారు. వీటితో పాటు ఇతర ప్రైవేటు వాహనాలు ప్రయాణికులను జారవేశాయి. ప్రస్తుతం ఉన్న కండక్టర్‌లతో పాటు మహిళా కండక్టర్లు, మెయింటనెన్స్ సి బ్బందిని తాత్కాలిక పద్ధతిన శుక్రవా రం నియమించారు. ఏడు రోజులుగా జిల్లాలో భూపాలపల్లి డిపో బస్సులు నిర్విరామంగా తిరుగుతున్నాయి. ఏడు రోజుల్లో సుమారు 15 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారుల వివరాలు ధ్రువీకరిస్తున్నాయి. ఆర్టీసీ వాహనాలే కాకుండా ప్రైవేట్ వాహనాలు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలిస్తున్నాయి.

కొనసాగిన 47 బస్సులు
భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం 47 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. వీటిలో 30 ఆర్టీసీ, 17 అద్దె బస్సులుండగా, 3 పాఠశాలల బస్సులు డిపో ఆధ్వర్యంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ప్రారంభంలో 20 బస్సులను ప్రారంభించిన అధికారులు.. వాటి సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగా బస్సులకు మెయింటనెన్స్ సమస్యలు వస్తుండడంతో తాత్కాలిక పద్ధతిన ఐటీఐ డీజిల్ మెకానిక్‌లుగా పనిచేసి అనుభవం ఉన్న నిరుద్యోగులను మెయింటనెన్స్ విభాగంలో శుక్రవారం నుంచి తీసుకుంటున్నారు. దీంతో బస్సులు నిరంతరాయంగా కొనసాగనున్నాయి.

డీటీవో పర్యవేక్షణలో..
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో శుక్రవారం అదనంగా తాత్కాలిక కండక్టర్ల(మహిళల) నియామకం డీటీవో వేణు ఆధ్వర్యంలో జరిగింది. మహిళా కండక్టర్లతో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తగ్గుతాయని భావించిన డీటీవో వేణు.. మహిళా కండక్టర్ల నియామకం చేపట్టారు. మెయింటనెన్స్ సిబ్బంది నియామకాన్ని వారు పర్యవేక్షించారు. అలాగే డిపో, బస్టాండ్ నుంచి వెళ్లే ప్రతి బస్సు డ్రైవర్‌కూ బ్రీత్ ఎనలైజర్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి, డ్రైవర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే బస్సులను బయటికి పంపుతున్నారు.

కొనసాగుతున్న ఆందోళనలు
భూపాలపల్లి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల, కార్మిక సంఘ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఒకరు సమ్మెకు మద్దతుగా గుండు కొట్టించుకున్నారు. కార్మికులు దీక్షలు కొనసాగిస్తున్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles