తొలిపోరు ఉత్కంఠ


Mon,January 21, 2019 01:34 AM

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) తొలిదశ పంచాయతీ ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. 1,60,534 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఏడు మండలాల్లోని 132 గ్రామ పంచాయతీల్లో 1,144 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారు(పీవో)లు, ఇతర ప్రిసైడింగ్ అధికారు(ఓపీవో)లు ఒక రోజు ముందే అంటే ఆదివారం బ్యాలెట్ బాక్సులు, పేపర్లతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రంలో సోమవారం ఆరు గంటల పాటు పోలింగ్ నిర్వహణకు సన్నాహాలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత రెండు గ్రామ పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ రెండు పంచాయతీల్లో ఎన్నికలను అధికారులు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కలిగింది. అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీలుగా అధికారులు గుర్తించిన 27 జీపీల్లో రెండింటిలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయగా మరో 18 గ్రామ పంచాయతీల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మరో ఏడింటిలో వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికలను చిత్రీకరించే ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రమైన టేకుమట్ల, ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీని వెబ్‌కాస్టింగ్‌కు ఎంపిక చేశారు. ఈ రెండు పంచాయతీల్లో పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల వెల్లడి, గెలిచిన వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్‌ను ఎన్నుకోవడం వంటివి వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు లైవ్‌లో వీక్షిస్తారు. జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా టేకుమట్ల, చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను లైవ్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంది.


అభ్యర్థుల్లో టెన్షన్
జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 415. వీటిలో భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని 158 గ్రామ పంచాయతీలు, 1358 వార్డు స్థానాలకు ఈ నెల 21న తొలి విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. పదో తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 158 గ్రామ పంచాయతీల్లో 33 జీపీల్లోని సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైంది. 1358 వార్డులకుగాను 396 వార్డు స్థానాల్లో కూడా బరిలో ఒక్కో అభ్యర్థి మాత్రమే ఉండడం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన 33 గ్రామ పంచాయతీల్లో 25 జీపీల్లో సర్పంచ్‌తో పాటు వార్డు స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగితే మిగతా ఏడు జీపీల్లో కొన్ని వార్డు స్థానాల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన ఏడింటితో సహా మొత్తం 132 గ్రామ పంచాయతీల్లో సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 125 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 407 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 132 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగే 967 వార్డు స్థానాల్లో 2,120 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల నుంచి మొత్తం 2,527 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సోమవారం పోలింగ్ జరగనుండడంతో సర్పంచ్, వార్డు అభ్యర్థుల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొని గెలుపు తీరాలకు చేరడానికి తుది ప్రయత్నాల్లో తలమునకలయ్యారు.

పీఎస్‌లకు చేరిన బ్యాలెట్ బాక్సులు
తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ కోసం స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు 132 మంది నియమితులయ్యారు. వీరితో పాటు 2,428 మంది పీవోలు, ఓపీవోలను ఎన్నికల కమిషన్ నియమించింది. ఆర్‌వోలు, పీవోలు, ఓపీవోలు ఆదివారం ఆయా మండల కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి తీసుకొని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 25 జోన్లు, 51 రూట్లలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఆర్‌వోలు, పీవోలు, ఓపీవోల కోసం తొలిదశలో 53 ఆర్టీసీ బస్సులు, 36 జీపులు, కార్లను సమకూర్చారు. వీటిలో ఎన్నికల సామగ్రితో గ్రామాలకు చేరుకున్న ఆర్‌వోలు, పీవోలు, ఓపీవోలు ఆదివారం రాత్రి పో లింగ్ కేంద్రాల్లో బస చేశారు. తొలి విడత ఎన్నికల నిర్వహణకు ఓట్ల సంఘం జిల్లాలో 1,316 బ్యాలెట్ బాక్సులు, బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థుల కోసం 1,60,534, వార్డు అభ్యర్థుల కోసం 1,60,534 బ్యాలెట్ పేపర్లను అందజేసింది. సోమవారం తొలిదశ ఎన్నికల నిర్వహణ కోసం 21 మంది మైక్రో అబ్జర్వర్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఆర్‌వోలు, పీవోలు, ఓపీవోలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి పూర్తి కాగానే ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత గెలిచిన ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సోమవారం స్థానిక హాలీ డే ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన ఆదివారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళితో మాట్లాడారు. ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు పలు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ స్వర్ణలత రేగొండ, భూపాలపల్లి మండలాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ ఆదివారం పంచాయతీ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బంది చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

117

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles