మూడో దశ ఆరంభం..!


Thu,January 17, 2019 01:51 AM

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి రోజు బుధవారం సర్పంచ్, వార్డు స్థానాలకు 135 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మూడో దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలు పర్వం కొనసాగనుంది. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే గడువు గురువారం ముగిసిపోనుంది. మొదటి దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఈ నెల 21న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరిపేందుకు ఓట్ల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలో 7 మండలాల్లోని 158 గ్రామ పంచాయతీల్లో తొలి విడత, మరో 7 మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో రెండో దశ, ఇంకో 6 మండలాల్లోని 133 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల్లోని 158 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేశారు.


పదో తేదీన వీటి పరిశీలన జరిగింది. ఈ అభ్యర్థుల్లో కొందరు 13వ తేదీన తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అదే రోజు సాయంత్రం ఎన్నికల అధికారులు తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 158 పంచాయతీల్లో 33 జీపీల సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవం కాగా మిగతా 125 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరిపే పనిలో అధికారులు ఉన్నారు. ఈ నెల 21న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరిపి అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో తొలి దశ ఎన్నికలు జరిగే మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, భూపాలపల్లి, కన్నాయిగూడెం, ఏటూర్‌నాగారం మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు కొద్ది రోజుల నుంచి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేరుగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని కోరుతున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మొత్తం 2,527 మంది బరిలో నిలిచారు.

రెండో దశ ఉపసంహరణకు నేడు అవకాశం
ఈ నెల 25న మల్హర్, మహాముత్తారం, కాటారం, మహదేవపూర్, పలిమెల, వాజేడు, వెంకటాపురం మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 124 గ్రామ పంచాయతీల్లోని 1076 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ 124 గ్రామ పంచాయతీలు, 1076 వార్డు స్థానాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 14న వీటిని పరిశీలించారు. రెండో దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఎన్నికల సంఘం ఈ నెల 17న(నేడు) గడువు ఇచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడానికి తుది గడువుగా ప్రకటించింది. దీంతో సర్పంచ్, వార్డు స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు కొందరు గురువారం మధ్యాహ్నం 3 గంటల్లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

విత్ డ్రా గడువు ముగిసిన తర్వాత ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు అదే రోజు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయిస్తారు. రెండో దశ ఎన్నికలు జరిగే 124 గ్రామ పంచాయతీల్లో ఐదు జీపీల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ 5 పంచాయతీల్లోని సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పవచ్చు. వెంకటాపురం మండలంలోని 3, వాజేడు మండలంలోని 2 గ్రామాలు ఈ ఐదింటిలో ఉన్నాయి. వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇదే మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో 11 వార్డు స్థానాల్లో కూడా నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు. పలిమెల మండలంలోని 1, మహాముత్తారం మండలంలోని 1, కాటారం మండలంలోని 2 వార్డు స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం రెండో దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల నుంచి 3,181 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వీరిలో ఎంత మంది బరిలో ఉంటారనేది తేలనుంది.

మూడో దశ ప్రారంభం
ఈ నెల 30న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. గణపురం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపూర్ మండలాల్లోని 133 గ్రామ పంచాయతీల్లో 1,192 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం బుధవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించారు. తొలి రోజున సర్పంచ్‌కు 58, వార్డు స్థానాలకు 77 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సర్పంచ్‌కు మండలం వారీగా గణపురంలో 15, గోవిందరావుపేటలో 6, మంగపేటలో 7, ములుగులో 13, తాడ్వాయిలో 5, వెంకటాపూర్‌లో 12 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు స్థానాలకు మండలం వారీగా గణపురంలో 26, గోవిందరావుపేటలో 11, మంగపేటలో 1, ములుగులో 20, తాడ్వాయిలో 3, వెంకటాపూర్‌లో 16 నామినేషన్ పత్రాలు అందినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 19న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగనుంది. వీటిలో నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలుగా అధికారులు తెలిపారు. విత్ డ్రా ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం ఎన్నికల అధికారులు మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల నుంచి సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

312

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles