గుప్త నిధుల కోసం నిర్మాణంలోని ఇంట్లో తవ్వకాలు

Sun,January 13, 2019 01:20 AM

-దుండగులు పరారీ
-దోష నివారణ కోసమే తవ్వకాలు : ఇంటి యజమాని
గణపురం, జనవరి12 :గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం .. ధర్మారావుపేటలో పాలకుర్తి నీలమ్మకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి రాళ్లు కొడుతున్న శబ్దాలు వినబడడంతో స్థానికులు, చుట్టుపక్కలవారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో తవ్వకాలు చేసే గుర్తు తెలియని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చేరుకొని తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించామని ఎస్సై తెలిపారు. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పూజలు నిర్వహించి, ఐదడుగుల మేర తవ్విన ఆనవాళ్లతోపాటు పెద్ద బండరాయి కూడా బయటపడ్డట్టు గుర్తించారు. ఇంటి యజమాని నీలమ్మను విచారించిన పోలీసులకు నిర్మాణంలో ఉన్న తమ ఇంటిలో సమాదులు ఉన్నాయని ఒక సాధువు దోష నివారణ కోసం పూజలు చేసి తవ్వకాలు జరపాలని సూచించారని, వాస్తు దోష నివారణ కోసమే తవ్వినట్లు ఆమె బుకాయించినట్లు తెలిసింది. అయితే గ్రామస్తులు మాత్రం గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పెద్ద బండరాయి ఉండడంతో దాని క్రింద పెద్ద మొత్తంలో గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానంతో ఈ తవ్వకాలు జరిపినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles