మొదటి రోజు 221 నామినేషన్లు


Sat,January 12, 2019 01:29 AM

-సర్పంచ్ 87.. వార్డులకు 134
-124 జీపీల్లో రెండోవిడత నామినేషన్ల దాఖలు ప్రారంభం
- మహదేవ్ సర్పంచ్ అత్యధికం
-పలిమెల, వాజేడులో ఒక్కో నామినేషన్ దాఖలు
- వార్డు స్థానాలకు నిల్
- రేపు సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ
జయశంకర్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ:రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. శుక్రవారం తొలిరోజు జిల్లాలో మొత్తం 221 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ 87, వార్డు స్థానాలకు 134 వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేందుకు ఓట్ల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 21న తొలి విడత, 25న రెండో విడత, 30న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 158 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. వీటిని గురువారం పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు తుది గడువు.


సర్పంచ్, వార్డు స్థానాల నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాలను అదేరోజు గ్రామ పంచాయతీ వారీగా ప్రకటిస్తారు. రెండోవిడత మరో ఏడు మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మండలం వారీగా కాటారంలో 24, మహదేవపూర్ 18, మహముత్తారంలో 24, మల్హర్ 15, పలిమెలలో 8, వెంకటాపురం(నూగూరు)లో 18, వాజేడులో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 124 గ్రామ పంచాయతీల్లో 1,076 వార్డులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రెండో విడత ఎన్నికలు జరిగే 124 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. శని, ఆదివారం కూడా ఈ పంచాయతీల్లో సర్పంచ్, వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు.

మహదేపూర్ అత్యధికం
మొదటిరోజు సర్పంచ్ అత్యధికంగా మహదేవపూర్ మండలంలో 24 నామినేషన్లు దాఖలయ్యాయి. పలిమెల, వాజేడు మండలాల్లో సర్పంచ్ అతి తక్కువగా కేవలం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఏడు మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మండలం వారీగా కాటారంలో 23, మహదేవపూర్ 24, మహాముత్తారంలో 14, మల్హర్ 15, పలిమెలలో ఒకటి, వెంకటాపురంలో 9, వాజేడులో ఒకటి లెక్కన నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వార్డు స్థానాలకు పలిమెల, వాజేడు మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మండలం వారీగా కాటారంలో 210 వార్డులు ఉంటే 20, మహదేవపూర్ 162 వార్డులకు గానూ 41, మహాముత్తారంలో 196 వార్డులు ఉండగా 22, మల్హర్ 128 వార్డులకు గానూ 45, వెంకటాపురంలో 166 వార్డులు ఉంటే 6 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. పలిమెల మండలంలో 62, వాజేడు మండలంలో 152 వార్డులు ఉండగా వీటికి నామినేషన్ల దాఖలు తొలిరోజున బోణీ కాలేదు. రెండో విడత ఎన్నికలు జరిగే 124 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు ఈ నెల 14వ తేదీన పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువు ఉంది. మూడో విడత ఎన్నికలు జరిగే ఇంకో ఆరు మండలాల్లోని 133 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1192 వార్డు స్థానాలకు 16వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇస్తారు. అదేరోజు ఉదయం 10.30 గంట నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు మూడో విడత పంచాయతీల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగియనుంది.

79

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles