వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి


Sat,September 22, 2018 01:39 AM

-చెరువుల వద్దకు పిల్లలను తీసుకెళ్లొద్దు
-విద్యుత్ తీగల వద్ద జాగ్రత్త వహించాలి
-గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
-ఎస్పీ ఆర్ భాస్కరన్
భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు గణపతి ఉత్సవ కమిటీలతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ ఆర్ భాస్కరన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. గత తొమ్మిది రోజులుగా గణేశ్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో నిమజ్జన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు, భక్తులు సురక్షితంగా తమ ఇంటికి చేరాలనేదే పోలీసుల అభిమతమని ఎస్పీ వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్లద్దని సూచించారు. వినాయక శోభయాత్రకు ఉపయోగించే వాహనాలు కండిషన్‌లో ఉండేలా సరి చూసుకోవాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. నిమజ్జన సమయంలో భారీ ప్రతిమలు మీద పడే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈతరాని వారు గణేశ్‌ని నిమజ్జనం చేసే క్రమంలో నీటిలోకి దిగొద్దని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమం త్వరితగతిన పూర్తి అయ్యేట్లు చూడాలని ఎస్పీ కోరారు. కాళేశ్వరం, ముల్లకట్ట, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు చెరువులు, వాగులు వద్ద సుమారు 500 మంది పోలీసులు నిమజ్జనం సందర్శంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ భాస్కరన్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...