కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి

Thu,September 20, 2018 05:02 AM

-మంత్రి చందూలాల్
-ఏటూరునాగారంలో బైక్ ర్యాలీ
ఏటూరునాగారం, సెప్టెంబర్ 19 : సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందని, అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ మోస పూరిత కుట్రలను తిప్పి కొట్టాలని, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకముందు మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలకేంద్రంలోని ప్రధాన రహదారి వెంట జరిగిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొని రోడ్‌షో నిర్వహించారు. ఓటర్లను పలకరించారు. మండలకేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని టీఆర్‌ఎస్‌ను గెలిపించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఆహ్వానం పలికారు.

నుదుట బొట్టు పెట్టి విజయం తమదే సారు అంటూ దీవెనలు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి చందూలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి బాటలోకి నడిపించేందుకు సీఎం కేసీఆర్ ఎన్నికలకు దిగారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కన్పించడం లేదని, తెలంగాణ ప్రభుత్వం నిర్విహిస్తున్న కంటి వెలుగుపరీక్షల్లో పరీక్షలు చేయించుకుని అభివృద్ధిని చూడాలని ఆయన ఎద్దేవా చేశారు.

అనేక రంగాలుగా అభివృద్ధి..
ఏటూరునాగారం ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.7కోట్లతో మాతా శిశు సంక్షేమ కేంద్రం, రూ.25లక్షలతో ఐసీయూను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. బ్లడ్ బ్యాంకు భవనం కూడా పూర్తి కావస్తుందన్నారు. డయాలసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏటూరునాగారంలోని వై జంక్షన్ నుంచి బస్టాండు వరకు రూ. 7కోట్లతో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ నెలలో టెండర్లు కూడా పూర్తి అవుతాయన్నారు. అదేవిధంగా ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటుకు తన నిధుల నుంచి రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ఆర్టీసీ అధికారులు పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఏటూరునాగారంలోని దయ్యంవాగుపై చెక్‌డ్యాం ఏర్పాటు చేసేందుకు కూడానిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధి లక్ష్యంగానే తాను పనిచేస్తానని పేర్కొన్నారు. ఈసారి రానున్న ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధికి దోహదపడాలని మంత్రి చందూలాల్ కోరారు.

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో నాలుగున్నరేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమకార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రూ. 4వేల కోట్లతో ములుగు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్న ములుగును మరింత అభివృద్ధి పర్చేందుకు బ్రేక్ వేయకుండా తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నూతి కృష్ణమూర్తి, ఎంపీపీ మెహరున్నీసా, ఎంపీటీసీ సభ్యుడు బెడిక రమేశ్, మండలపార్టీ అధ్యక్షుడు కూనూరు మహేశ్, ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ సభ్యులు అపర్ణ, అనిత, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సాయిని శ్రీనివాస్, గడదాసు సునీల్‌కుమార్, అజ్మత్‌ఖాన్, ఈసం స్వరూప, బండి లక్ష్మి, కనకతార, కావిరి చిన్ని కృష్ణ, ఖాజాపాషా, ఎజాజ్, ఫత్తే మహ్మద్, దొడ్డ కృష్ణ, వావిలాల రాంబాబు, పలు గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles