రైతు రాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

Wed,September 12, 2018 03:22 AM

కాటారం, సెప్టెంబర్ 11: రైతురాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మండలంలోని గుమ్మళ్లపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నడిగోట సమ్మయ్య అనే రైతు కుటుంబానికి ఎల్‌ఐసీ ద్వారా మంజూరైన రూ. 5లక్షల రైతు బీమా బాండ్లు మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆకాంక్షతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అధికారంలో ఉన్నంత కాలం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి ఎకరాకు రూ.4వేలను అందించడంతో పాటు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేసిందన్నారు. రైతు చనిపోతే రైతుబీమా పథకం ద్వారా మృతి చెందిన రైతన్నల కుటుంబాలకు పరిహారం అందించి ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రాజెక్ట్‌లు పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలంగా మారితే ప్రజల్లో ఉనికిని కోల్పోతామని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు.

60ఏళ్లలో ఏనాడు రైతుల, ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇపుడు అధికారం కోసం ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఎప్పుడూ వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని రాత్రి విద్యుత్ వల్ల ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన కరెంటును అందించిందన్నారు. రాష్ట్రంలో ఎవరూ ఇబ్బందుల్లో లేరని కేవలం కాంగ్రెస్ నేతలకే ప్రజాదరణ కరువై ఆందోళన చెందుతున్నారన్నారు. అనంతరం జాదరావుపేట, ధన్వాడ, కిష్టంపేటలో ఇటీవల జ్వరాల బారిన పడి మృతి చెందిన కంకణాల తిరుపతిరెడ్డి, బోడ శ్రావణ్, బోడ శృతి కుటుంబాలను ఎమ్మెల్యే పుట్ట మధు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తుల్సెగారి శంకరయ్య, కో-ఆప్షన్ సభ్యుడు జావీద్‌ఖాన్, ఎంపీటీసీ కుమ్మరి అశోక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కుడుదుల రాజబాపు, నాయకులు తైనేని సతీశ్, భూపెల్లి రాజు, నరివెద్ది శ్రీనివాస్, గుడిపాటి రమేశ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, సమ్మయ్య, శివశంకర్, రవి మల్లారెడ్డి, బోడ తిరుపతి, కుసుమ నరేశ్, జిల్లెల్ల మల్లేశ్ ఉన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles