చెక్‌పోస్ట్ సిబ్బంది అక్రమ వసూళ్లు


Mon,September 10, 2018 01:03 AM

కాటారం, సెప్టెంబర్ 09 : అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అడ్డదారిలో వేలాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సిబ్బంది కొందరు అటవీ అధికారుల సహయంతో డబ్బులు దోచుకుంటున్నారు. రసీదులు లేకుండా ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఇలాగే చేతివాటం ప్రదర్శించగా 14 మందిని ఉన్నతాధికారులు తొలగించినా సిబ్బంది తీరు మారలేదు . మండలకేంద్రం శివారులోని నస్తూర్‌పల్లి సమీపంలో గల అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద శనివారం రాత్రి విధులు నిర్వహించిన చెక్‌పోస్ట్ సిబ్బంది పలు ఇసుక లారీల డ్రైవర్ల వద్ద ఒక్కో దానికి రూ. 50 చొప్పున వసూలు చేసి రసీదులు ఇవ్వలేదు. మండలకేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో అటవీశాఖ అధికారులు, పోలీసులు నియమించిన సిబ్బంది లారీల వద్ద రసీదుల కోసం తనిఖీ చేశారు.

సుమారు 50 లారీలను ఆపి తనిఖీ చేయగా 30 లారీల డ్రైవర్లు రసీదులు చూపించలేదు. దీంతో డ్రైవర్లను ప్రశ్నించగా అటవీశాఖ చెక్‌పోస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకొని రసీదులు ఇవ్వలేదని వెల్లడించారు. దీంతో తనిఖీలు చేసిన సిబ్బంది వెంటనే సీఐ శివప్రసాద్, చెక్‌పోస్ట్ ఇన్‌చార్జి, మహదేవ్‌పూర్ రేంజర్ జగదీశ్‌చందర్‌రెడ్డికి ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే వారు ఈ విషయంపై విచారణ చేయగా డబ్బులు తీసుకొని రసీదులు ఇవ్వలేదని తేలింది. దీంతో రేంజర్ జగదీశ్‌చందర్‌రెడ్డి 7 గురు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆదివారం తొలగించారు. ఈ సంఘటనపై ఆయన మాట్లాడుతూ.. డబ్బులు వసూలు చేసిన వారిని తొలగించామని సహకరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...