పీహెచ్‌సీల్లో వైద్య సేవలు సక్రమంగా అందాలి

Sat,September 8, 2018 02:08 AM

కాటారం, సెప్టెంబర్ 07 : పీహెచ్‌సీ, సబ్ సెంటర్లలో నిధుల వినియోగం సక్రమంగా జరుగాలని, వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని సీఆర్‌ఎం (కామన్ రివ్యూ మిషన్) కేంద్ర, రాష్ట్ర పరిశీలక బృందాలు వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతోపాటు ధన్వాడ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలు తీరును బృంద సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించి అన్ని అంశాలను నమోదు చేయాలని పర్యవేక్షకులకు సూచించారు. ధన్వాడ హెల్త్, వెల్‌నెస్ సెంటర్‌లో అందుతున్న ఆరోగ్య సేవలు, గర్భిణులకు అందుతున్న సేవలు, టీకాల కార్యక్రమం అమలు, అసంక్రమిత వ్యాధుల సర్వే, చికిత్సలపై పూర్తిస్థాయిలో పరిశీలన బృందం సభ్యులు తనిఖీ చేపట్టారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను ప్రతి అంశంపై ప్రశ్నించారు. అనంతరం పీహెచ్‌సీలో ఎన్‌హెచ్‌ఎం ద్వారా అందిన నిధుల వినియోగంను అడిగి తెలుసుకొని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్‌సీడీ(అసంక్రమిత వ్యాధులు) సర్వే స్క్రీనింగ్, చికిత్సలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. అనంతరం పీహెచ్‌సీలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి పలువురు వైద్యులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సీఆర్‌ఎం కేంద్ర బృందం సభ్యులు డాక్టర్లు రఘురామారావు, నిఖిల్ హెరార్, డాక్టర్ శ్వేతసింగ్, డాక్టర్ సత్యజిత్‌సాహూ, రాష్ట్ర బృందం సభ్యులు డాక్టర్ జనార్దన్, డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ శివబాలాజీ, డాక్టర్ జగన్నాథరెడ్డి, డీఎంహెచ్‌వో అల్లం అప్పయ్య, ఎండీ హకీం, శ్రీనివాస్, మల్లిఖార్జున్, శ్రీనివాస్, మల్లికార్జున్, పీహెచ్‌సీ వైద్యులు ఉమాదేవి, ప్రమోద్‌కుమార్, పీహెచ్‌ఎన్ విమలకుమారి, హెచ్‌వీ బ్యూలా, ఏఎన్‌ఎంలు సరోజన, రజిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

142
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles