ఆశీర్వాదానికి అంతా సిద్ధం


Fri,September 7, 2018 02:47 AM

-హుస్నాబాద్‌కు పోటెత్తనున్న జనం
-శాసన సభ రద్దుతో మరింత ఉత్సాహం
-జిల్లా నుంచి 20 వేల మంది వెళ్తారని అంచనా
-ఏర్పాట్లు పూర్తి చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ: ఇప్పుడు అందరి చూపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వైపే.. అటు అసెంబ్లీని రద్దు చేసిన అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, రానున్న ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావం పూరించనుండడంతో హుస్నాబాద్ సభకు అనూహ్యంగా ప్రత్యేకత సంతరించుకుది. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట 50 రోజుల్లో 100 నియోజక వర్గాల్లో 100 బహిరంగ సభలను నిర్వహించేందుకు నిర్ణయించిన కేసీఆర్ మొదటగా హుస్నాబాద్‌ను ఎన్నుకోవడం ఆసక్తికరంగా మారింది. మాధ్యాహ్నం 2.30 అద్ధార్మ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా సభాస్థలి చేరుకుంటారు. రెండు గంటల పాటు సభ కొనసాగనుంది. ఈ సభకు భారీ ఎత్తున జనం రానుండడంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. మన జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవర పల్లి మండలాలు హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలోనే ఉండడంతో ఈ రెండు మండలాల నుంచి సుమారు ఇరవై వేల మంది సభకు తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీని కోసం టీఆర్‌ఎస్ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలను స్వయంగా కలిసి సభకు ఆహ్వానం పలుకుతున్నారు. రానున్న ఎన్నికలకు ఇది తొలి ప్రచార సభగా చెబుకుంటున్న జనం వేలాదిగా వెళ్లేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. గత రెండు రోజులుగా భీమదేవరపల్లికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ భూపతి రెడ్డి, మంథని తాజా మజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఎల్కతుర్తికి కోరుట్ల తాజా మజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో పాటు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జనాలను తరలించేందుకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే హుస్నాబాద్ సభాస్థలిలో సైతం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి సభా వేదికను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు సైతం భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ పట్టణం నుంచి సభాస్థలికి వెళ్లే అన్ని మార్గాల్లో వాహన పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పదెకరాల స్థలంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు.

వేదికపై వందమది వేదిక ముందు ఐదు వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. కాగా సభాస్థలి వద్ద తాజా మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లడుతూ 2014లో ఎన్నికల శంఖారావం హుస్నాబాద్ నుంచే పూరించి ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఇప్పుడు కూడా హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తున్నామని గతానికంటే భారీ విజయాలను చేజిక్కించుకుంటామని ధీమావ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీశ్ కుమార్ భారీ మొజార్టీతో గెలవడం ఖాయమైందని జోస్యం చెప్పారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నుంచి వెళ్లే వాహనాలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో పార్కింగ్ కేటాయించారు. ఈ సభకు ముగ్గురు ఎస్పీలతో పాటు, 5గురు ఏఎస్పీలు, 15 మంది ఏసీపీలు, ఇద్దరు ఏఆర్ డీస్పీలు, 50 మంది సీఐలు, 101 మంది ఎస్సైలు, 120 మంది ఏఎస్సైలు, 905 మంది కానిస్టేబుళ్లు, మహిళ పీసీలు 80 మంది, ఏఆర్ పీసీలు 100 మంది, స్పెషల్ పార్టీలు ఎనిమిది, డాగ్ స్వాడ్ 5 మంది, బాంబ్ డిస్పోజల్ టీంలు 10, రోడ్ ఓపెనింగ్ పార్టీలు 15, బందోబస్తులో ఉన్నారు. సభను మొత్తం 20 సెక్టార్లుగా విభజించారు. కమ్యూనికేషన్ సెట్టు 100 ఏర్పాటు చేశారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...